'ఆహా'లో నయనతార మిస్టరీ థ్రిల్లర్ .. ట్రైలర్ రిలీజ్!

21-07-2021 Wed 11:29
  • మలయాళంలో 'నిళల్'
  • ప్రధాన పాత్రలో నయనతార
  • తెలుగు అనువాదంగా 'నీడ'
  • 23వ తేదీన 'ఆహా'లో
Nayanatara Needa movie trailer released in Aha

తెలుగు ఓటీటీ రంగంలో 'ఆహా' ఎంతో ఉత్సాహంగా దూసుకుపోతోంది. వైవిధ్యభరితమైన సినిమాలను అందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ నెల 23వ తేదీన 'ఆహా' నుంచి మరో ఇంట్రెస్టింగ్ మూవీ రానుంది. మలయాళంలో నయనతార నటించిన 'నిళల్' సినిమాను, తెలుగులో 'నీడ' పేరుతో విడుదల చేస్తున్నారు. అప్పు భట్టాత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కుంచాకో బోబన్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

సెకండ్ క్లాస్ చదువుతున్న ఓ పిల్లాడు తన తోటి పిల్లలకు ఒక కథ చెబుతాడు. ఆ కథ విన్న మిగతా పిల్లలంతా భయంతో వణికిపోతారు. ఆ కథ ఏమిటి? స్కూల్ నుంచి మొదలైన ఆ కథ ఏ స్థాయివరకూ వెళుతుంది? ఆ పిల్లాడు .. అతని తల్లి జీవితాలను ఆ కథ ఎలా ప్రభావితం చేసింది? అనేదే ఈ సినిమా కథ. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. నయనతార ప్రధాన పాత్ర కావడం వలన, అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఇక ఈ సినిమాకి ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో చూడాలి.