ఆ నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాల కూల్చివేత వెనకా కేంద్రం: కాంగ్రెస్

21-07-2021 Wed 10:09
  • ‘ది వైర్’ కథనం నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నేతల విలేకరుల సమావేశం
  • మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది
  • పెగాసస్‌పై చర్చకు మోదీ అందుకే అంగీకరించడం లేదు
  • పదవిలో కొనసాగే నైతిక అర్హత అమిత్ షాకు లేదు
Pegasus Used In another four states To Collapse Our Government alleged congress

2019లో కర్ణాటకలోని కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడం వెనక కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉందన్న ‘ది వైర్’ కథనం నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు నిన్న ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. 

పెగాసస్ సాయంతో కర్ణాటకలోని కుమారస్వామి ప్రభుత్వాన్ని కేంద్రం కూలదోసిందన్నారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు.

కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూలదోసినందువల్లే ఈ వ్యవహారంపై చర్చకు ప్రధాని అంగీకరించడం లేదని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా అన్నారు. మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, గోవాలోని ప్రభుత్వాలు కూలిపోవడం వెనక కూడా కేంద్రం హస్తం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.