Singareni: సింగరేణి సిబ్బంది పదవీ విరమణ వయసు పొడిగింపు

Singareni Workers Retirement age extended to 61 years
  • సింగరేణి కార్మికుల సమస్యలపై కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
  • తాజా నిర్ణయంతో 43,899 మందికి లబ్ధి
  • సింగరేణి వైద్య కళాశాల ఏర్పాటుకు నిర్ణయం
సింగరేణి సిబ్బంది, కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారి పదవీ విరమణ వయసును గరిష్ఠంగా 61 ఏళ్లకు పెంచాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలనే విషయాన్ని ఈ నెల 26న నిర్వహించే బోర్డు సమావేశంలో నిర్ణయించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను కేసీఆర్ ఆదేశించారు. సింగరేణి కార్మికుల సమస్యలు, ఇతర అంశాలు, వాటి పరిష్కారాలపై కేసీఆర్ నిన్న నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వ తాజా నిర్ణయంతో సంస్థలోని 43,899 మంది ఉద్యోగులు, అధికారులు, కార్మికులకు లబ్ధి చేకూరుతుంది. అలాగే, నియోజకవర్గ కేంద్రంలో సింగరేణి వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని కూడా కేసీఆర్ నిర్ణయించారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన ఇందిరమ్మ, ఎన్టీఆర్ ఇళ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో వాటి స్థానంలో కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రజాప్రతినిధులు కేసీఆర్‌ను కోరారు. సొంత స్థలాలున్న పేదలకు ఇంటి నిర్మాణానికి నగదు సాయం చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఇందుకు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన దళిత బంధు పథకాన్ని అర్హులకు అందేలా కృషి చేయాలని కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు.
Singareni
Retirement Age
Telangana
KCR

More Telugu News