డబ్బుంటే మాత్రం మరీ ఇంత ఆడంబరమా?... అమెరికాలో 'బంగారు కారు'పై ఆనంద్ మహీంద్రా స్పందన

20-07-2021 Tue 21:14
  • భారతీయ అమెరికన్ పౌరుడి దర్పం
  • స్వచ్ఛమైన బంగారంతో ఫెరారీ కారు
  • అచ్చెరువొందిన ఇతర అమెరికన్లు
  • సంపన్నులు ఇలా ఖర్చు చేయరాదన్న మహీంద్రా
Anand Mahindra responds to golden ferrari car in USA

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటారు. తనను బాగా ఆకర్షించిన అంశాలను ఆయన నెటిజన్లతో పంచుకునేందుకు సోషల్ మీడియా వేదికలను ఉపయోగించుకుంటారు. ఆనంద్ మహీంద్రా పోస్టుల్లోని అంశాలు తప్పకుండా ఆలోచింపజేసేవిగా ఉంటాయి. తాజాగా ఆయన ఓ వీడియోను పంచుకున్నారు.

అందులో ఓ భారతీయ అమెరికన్ పౌరుడు బంగారంతో తయారుచేసిన ఫెరారీ స్పోర్ట్స్ కారులో షికారు చేయడం చూడొచ్చు. స్వచ్ఛమైన పసిడిని ఆ కారు తయారీలో ఉపయోగించారు. ఈ కారును ఇతర అమెరికన్లు సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా, సదరు భారతీయ అమెరికన్ పౌరుడు ఎంతో దర్పం ఒలకబోస్తూ రివ్వున దూసుకెళ్లాడు.

దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఈ విషయం సోషల్ మీడియాలో ఎందుకింత వైరల్ అవుతుందో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. డబ్బు ఉన్నంత మాత్రాన సంపన్నులు ఈ విధంగా ఖర్చు చేయకూడదన్నది దీని ద్వారా నేర్చుకోదగిన పాఠం అని ఆనంద్ వివరించారు.