'రామ్ సేతు'లో కీలక పాత్రలో సత్యదేవ్!

20-07-2021 Tue 16:29
  • సత్యదేవ్ కు మరోసారి బాలీవుడ్ ఛాన్స్ 
  • అక్షయ్ కుమార్ హీరోగా 'రామ్ సేతు'
  • చాలా హ్యాపీగా ఉందన్న సత్యదేవ్  
Satyadev to play key role in Ram Setu

బాలీవుడ్ నటులు కొందరు తెలుగు సినిమాలలో నటిస్తుండడం మనం ఎక్కువగా చూస్తూనే ఉంటాం. అయితే, మన టాలీవుడ్ నటులు హిందీ సినిమాలలో నటించే అవకాశాలను పొందడం మాత్రం తక్కువనే చెప్పచ్చు. అలాంటి అరుదైన అవకాశం ఇప్పుడు హీరో సత్యదేవ్ కి మరోసారి వచ్చింది.

తన కెరీర్ మొదట్లో పలు సినిమాలలో రకరకాల పాత్రలు పోషించిన సత్యదేవ్.. ఆ తర్వాత హీరోగా మారి టాలెంటెడ్ ఆర్టిస్టుగా పేరుతెచ్చుకున్నాడు. అలాగే, గతంలో 'టగ్స్ ఆఫ్ హిందుస్తాన్' అనే హిందీ సినిమాలో కూడా నటించాడు.    

ఈ క్రమంలో తాజాగా 'రామ్ సేతు' హిందీ సినిమాలో సత్యదేవ్ కు అవకాశం వచ్చింది. అభిషేక్ శర్మ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు ఆయన ఎంపికయ్యాడు.

దీని పట్ల సత్యదేవ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, కొన్ని సంఘటనలు మనం ఊహించకుండానే జరిగిపోతుంటాయి. నా బాలీవుడ్ ఎంట్రీ కూడా అలాగే జరిగింది. ఇప్పుడీ రామ్ సేతు సినిమాలో కూడా అలాగే అవకాశం వచ్చింది.. చాలా హ్యాపీగా వుంది" అని చెప్పాడు. ప్రస్తుతం తను తెలుగులో 'తిమ్మరుసు', 'గుర్తుందా శీతాకాలం', 'గాడ్సే', 'స్కైలాబ్' సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు.