బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు ఈ నెల 23 వరకు పోలీస్ కస్టడీ

20-07-2021 Tue 16:21
  • కుంద్రాపై తీవ్ర ఆరోపణలు
  • అశ్లీల చిత్రాలు నిర్మిస్తున్నాడన్న పోలీసులు
  • యాప్ లకు విక్రయిస్తున్నాడని వెల్లడి
  • కోర్టులో హాజరుపరిచిన వైనం
Mumbai court orders police custody for Raj Kundra

అశ్లీల చిత్రాలు నిర్మించి, వాటిని పలు యాప్ లలో ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలపై నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. రాజ్ కుంద్రాపై ఐపీసీతో పాటు ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో, నేడు రాజ్ కుంద్రాను పోలీసులు ముంబయి కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల అభ్యర్థనపై ఆయనకు ఈ నెల 23 వరకు పోలీస్ కస్టడీ విధించారు.

కాగా, కుంద్రాతో పాటు రియాన్స్ థోర్ అనే మరో నిందితుడ్ని కూడా ముంబయి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. పోర్న్ చిత్రాలు నిర్మించి, వాటిని యాప్ లకు విక్రయిస్తూ కుంద్రా ఆర్థికంగా లాభాలు ఆర్జించారని పోలీసులు కోర్టుకు తెలిపారు. మరింత సమాచారం రాబట్టేందుకు అతడిని కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ నేపథ్యంలో, పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ముంబయి కోర్టు నిర్ణయం తీసుకుంది. కుంద్రా ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులోని డేటాను విశ్లేషించే పనిలో పడ్డారు.