ఏపీలో ఉన్న తెలంగాణ ఏజెంట్లు కేసీఆర్ కు తొత్తులుగా మాట్లాడుతున్నారు: విష్ణువర్ధన్ రెడ్డి

20-07-2021 Tue 14:40
  • జలవివాదాల నేపథ్యంలో విష్ణు ఘాటు వ్యాఖ్యలు
  • కేసీఆర్ నీటి దొంగ అని విమర్శలు
  • వామపక్ష నేతలపై ఆగ్రహావేశాలు
  • సిగ్గుందా లేదా? అంటూ తీవ్ర పదజాలం
BJP leader Vishnu Vardhan Reddy fires on Communist party leaders

ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి జలవివాదాల నేపథ్యంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఉన్న తెలంగాణ ఏజెంట్లు కేసీఆర్ కు తొత్తుల్లా మాట్లాడుతున్నారంటూ వామపక్ష నేతలపై మండిపడ్డారు. ఏపీ నీళ్లను దొంగల్లా వాడుకుంటూ కేసీఆర్ జలదోపిడీకి పాల్పడుతున్నాడని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ నీటి దొంగలేనని విమర్శించారు. ఏపీకి తెలంగాణ ద్రోహం చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తప్పేంటి? అని విష్ణువర్ధన్ రెడ్డి నిలదీశారు.

"సీపీఎం, సీపీఐ పార్టీలకు సిగ్గుందా? లేదా? ఈ వ్యవహారంలో మోదీ జోక్యం చేసుకోవాలని నాడు మాట్లాడిన వారు, ఇప్పుడు మోదీ జోక్యం చేసుకుంటే తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. మీ పార్టీలకు అజెండా లేదా? ఏపీకి రావాల్సిన నీటి విషయంలో సీపీఎం, సీపీఐ తెలంగాణకు ఎందుకు అనుకూలంగా మాట్లాడుతున్నాయో ప్రజలకు చెప్పాలి. సీపీఎం, సీపీఐ పార్టీలు టీఆర్ఎస్ కు తొత్తులు" అంటూ విష్ణు నిప్పులు చెరిగారు.