హక్కు పత్రం కోసం సాయమడిగితే.. భూమినే ఆక్రమించేసిన మున్సిపల్ కౌన్సిలర్
- హక్కు పత్రానికి రూ.2 లక్షల డిమాండ్
- ఇవ్వలేమని చెప్పిన బాధిత మహిళ
- రూ.70 లక్షల విలువైన భూమి ఆక్రమణ
- నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న నేత
తన పేరిట హక్కు పత్రం ఇప్పించాలని కోరుతూ కొన్ని నెలల క్రితం ఓ మున్సిపల్ కౌన్సిలర్ సాయం కోరింది. అందుకు అతగాడు రూ.2 లక్షలు డిమాండ్ చేశాడు. తాము అంత ఇవ్వలేమని ఆమె అనడంతో ఆ స్థలంలోని 100 గజాలను ఆక్రమించాడు. తన స్నేహితుడి భూమి అంటూ నకిలీ పత్రాలు సృష్టించి తన సోదరుడి కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు.
ఇదేంటని అడిగిన ఆమెపై.. అసలు ఆ స్థలమే మీది కాదంటూ దౌర్జన్యానికి దిగాడు. అడిగిన డబ్బులు ఇవ్వనందుకే ఇలా చేశానంటూ ఎగతాళిగా మాట్లాడాడు. దీంతో రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి ఒరిజినల్ పత్రాలను సేకరించిన ఆమె.. హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఆ కేసును సైబరాబాద్ కమిషనరేట్ కు బదిలీ చేశారు.