ఢిల్లీకి తీసుకెళ్లిన ఆ ఆరు బ్యాగుల్లో ఏమున్నాయ్​?: కర్ణాటక సీఎంకి కుమారస్వామి సూటిప్రశ్న

20-07-2021 Tue 13:21
  • ప్రధానితో భేటీపై అనుమానాలు
  • వాటిలో కానుకలున్నాయా?
  • వాటినేమైనా మోదీకిచ్చారా?
Whats In Those Six Bags Kumaraswamy Piques Curiosity On Yediyurappa Meet With Modi

కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్. యడియూరప్పపై మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి విమర్శలు కురిపించారు. ప్రధాని నరేంద్ర మోదీతో యడియూరప్ప భేటీ తనలో ఎన్నో సందేహాలను కలుగజేసిందన్నారు. ‘‘నాకున్న సమాచారం మేరకు మోదీతో భేటీకి యడియూరప్ప ఆరు బ్యాగులు తీసుకెళ్లారు. ఇంతకీ ఆ బ్యాగుల్లో ఏమున్నాయ్?’’ అని ఆయన ప్రశ్నించారు.

కర్ణాటక ఎదుర్కొంటున్న సమస్యల జాబితాల పత్రాలున్నాయా? లేదంటే మరేమైనా ఉన్నాయా? అని ఆయన అడిగారు. అయితే, మీడియా కథనాలు మాత్రం ఆ బ్యాగుల్లో ‘కానుక’లున్నాయంటూ చెబుతున్నాయని పేర్కొన్నారు. ఆ బ్యాగులన్నింటినీ ప్రధాని మోదీకి యడియూరప్ప ఇచ్చారా? అని సందేహం వ్యక్తం చేశారు.

పార్టీ జిల్లాల కార్యకర్తలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు రోజులుగా జిల్లా స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నామని, జిల్లా పంచాయతీలు, తాలూకా పంచాయతీల ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇవి సెమీ ఫైనల్స్ లాంటివన్నారు.

మేకదాతు, మహాదయీ సమస్యలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వస్తున్నారంటూ యడియూరప్ప చెప్పారని, కానీ, తీరా వచ్చాక ఆయన కేవలం జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుకు సంబంధించిన సమీక్షనే చేశారని అసహనం వ్యక్తం చేశారు.