నిరుద్యోగ యువత కోసం వినతిపత్రం ఇస్తామంటే అరెస్ట్ చేస్తారా?: నాదెండ్ల మనోహర్

20-07-2021 Tue 11:28
  • రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వైసీపీ మోసం చేసింది
  • జనసేన కార్యక్రమంతో జగన్ ఇబ్బంది పడుతున్నారు
  • నిరుద్యోగులకు జనసేన అండగా ఉంటుంది
Jagan feeling discomfort with Janasena activities says Nadendla Manohar

రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నయవంచనకు పాల్పడిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. నిరుద్యోగులకు అండగా నిలుస్తున్న జనసేన నేతలు, కార్యకర్తలను గృహ నిర్బంధంలో ఉంచుతున్నారని.. ఇది అప్రజాస్వామికమని అన్నారు. జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజీల్లో జిల్లా ఉపాధి అధికారికి వినతి పత్రాలను ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు జనసేన చేపట్టిందని... అయితే, వినతిపత్రాలు ఇచ్చేందుకు వెళ్తున్న తమ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇచ్చి, గృహనిర్బంధాలు చేయడం, కొన్నిచోట్ల పోలీస్ స్టేషన్లకు తరలించడం వంటివి చేశారని అన్నారు. వినతిపత్రాలు ఇవ్వడం ప్రజాస్వామ్యంలో ఒక హక్కు అని... దాన్ని అడ్డుకోవడం నియంతృత్వ పోకడ అవుతుందని చెప్పారు. జనసేన చేపట్టిన కార్యక్రమంతో ముఖ్యమంత్రి జగన్ ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఆయన ఇచ్చిన హామీని గుర్తు చేసి, అమలు చేయమని చెపితే ఇబ్బంది కలుగుతోందా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు భారీ సభలను నిర్వహించి, ఊరేగింపులు చేసి, సన్మాన కార్యక్రమాలను చేసుకుంటే లేని ఇబ్బంది... యువత కోసం జనసేన శాంతియుతంగా చేపడితే వచ్చిందా? అని ఎద్దేవా చేశారు.

జనసేనకు కార్యక్రమాలకు ఇచ్చే నోటీసులు, వర్తించే నిబంధనలు అధికార పార్టీ హంగామాలకు, కార్యక్రమాలకు ఎందుకు వర్తించవని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎంత కట్టడి చేయాలని ప్రయత్నించినా... నిరుద్యోగులకు జనసేన అండగా ఉంటుందని చెప్పారు.