మెగాస్టార్, పవర్ స్టార్ కంటే నాకే ఫాలోయింగ్ ఎక్కువ.. అందుకే ఎదురు డబ్బిస్తున్నారు: ఏపీ అఫిడవిట్‌పై రఘురామ ఎద్దేవా

20-07-2021 Tue 08:55
  • యూరోల్లో డబ్బులు బదిలీ చేసే అలవాటు ఉండబట్టే ఆ పదాన్ని ఉపయోగించారు
  • ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే అఫిడవిట్
  • వలువల కంటే ఈజీగా విలువలు విప్పేస్తున్నారు
  • గిల్లికజ్జాలకు పోలవరం, ప్రత్యేక హోదా ముసుగు
MP Raghurama Raju Satires Andhrapradesh govt affidavit against him

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కంటే తనకే ఎక్కువ పాప్యులారిటీ ఉందని, అందుకే మీడియా సంస్థలు తనకు మిలియన్ల కొద్దీ యూరోలు ఇచ్చి మరీ తనతో మాట్లాడించుకుంటున్నాయంటూ ఏపీ ప్రభుత్వంపై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సెటైర్లు వేశారు.

ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్ని ఓ మీడియా సంస్థ నుంచి రఘురామరాజు మిలియన్ యూరోలు తీసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌పై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. యూరోలలో తనకు డబ్బులు చెల్లించారన్న దానిపై మాట్లాడుతూ.. డబ్బుల బదిలీల అలవాటున్నవారు బహుశా యూరోలలో తనకు బదిలీ చేసి ఉంటారని, అందుకే ఆ పదాన్ని ప్రయోగించి ఉంటారని ఎద్దేవా చేశారు.

సాధారణంగా అందరూ అడిగి మరీ మీడియాలో తమ వార్తలు వేయించుకుంటారని, కానీ తనకే ఎదురు డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తున్నారని ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొందని, ఇలా ఎందుకు దిగజారిపోతారో తనకు తెలియదని అన్నారు. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే ప్రభుత్వం తనపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని ఆయన ఆరోపించారు. అఫిడవిట్‌లో తనపై మోపిన అభియోగాలన్నీ పసలేనివేనని కొట్టిపడేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి చాలా నిస్పృహలో ఉన్నారని అన్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టేసి గిల్లికజ్జాలు పెట్టుకుంటూ వాటికి ప్రత్యేక హోదా, పోలవరం నిధుల ముసుగు వేస్తున్నారని రఘురామ రాజు మండిపడ్డారు.

విలువల గురించి పదేపదే చెబుతున్న వారు వలువల కంటే సులభంగా విలువలను వలిచేస్తున్నారని అన్నారు. తనపై ఇష్టం వచ్చినట్టు పేలుతున్న విజయసాయిరెడ్డి జనసేన తరఫున నెగ్గిన రాపాక వరప్రసాద్‌ సహా మరో ముగ్గురు ఎమ్మెల్యేలను ఎలా కలుపుకున్నారని ప్రశ్నించారు. శ్రీరంగ నీతులు చెబుతున్నవారు తనను ఏమన్నా ఫరవాలేదు కానీ, స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోదీని ఏమైనా అంటే బాగుండదని హెచ్చరించారు.

కులాల అంతరాలు తొలగించాల్సిన ప్రభుత్వం కార్పొరేషన్ పదవులను కులాలవారీగా విభజించి లేనిపోని అంతరాలు సృష్టిస్తోందని ఆరోపించారు. పెద్దపెద్ద కార్పొరేషన్ చైర్మన్ పోస్టులన్నీ ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టారని రఘురామ రాజు విమర్శించారు.