22, 23 తేదీల్లో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణశాఖ

20-07-2021 Tue 06:55
  • ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
  • భారీ వర్షాల ప్రభావం మెదక్, సంగారెడ్డి జిల్లాలపై ఉండే అవకాశం
  • సగటు వర్షపాతానికి మించి కురుస్తున్న వానలు
Heavy Rains forecast on 22 and 23 in Telangana

గత కొన్ని రోజులుగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో పంటలకు అపారనష్టం వాటిల్లింది. కాగా, రాష్ట్రంలో ఈ నెల 22, 23వ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావం మరీ ముఖ్యంగా  మెదక్, సంగారెడ్డి జిల్లాలపై పడే అవకాశం ఉందని పేర్కొంది.

రాష్ట్రమంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. గత నెల 1 నుంచి నిన్నటి వరకు (19వ తేదీ) 258.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఏకంగా 409.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 178 శాతం వర్షపాతం నమోదైంది. ఇక, ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడగా, వికారాబాద్ జిల్లా బొంరాసిపేట మండలం దుడ్యాలలో గరిష్ఠంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.