China: లడఖ్ సమీపంలో ఎయిర్ బేస్ ను విస్తరిస్తున్న చైనా

  • ఎల్ఏసీ వెంబడి వాయుసేనను బలోపేతం చేస్తున్న చైనా
  • ఇప్పటికే ఉన్న బేస్ ఆధునికీకరణ
  • వ్యూహాత్మక పట్టు కోసం ప్రయత్నాలు
  • లడఖ్ ప్రాంతంలో భారత్ కు అనుకూలత
China extends Shakche airbase for future needs along with LAC

చైనా ఓవైపు చర్చలు అంటూనే సరిహద్దుల వెంబడి నిర్మాణాలు చేపడుతూనే ఉంది. తాజాగా తూర్పు లడఖ్ ప్రాంతానికి సమీపంలో అత్యాధునిక సౌకర్యాలతో ఎయిర్ బేస్ విస్తరణ చేపట్టింది. ఇప్పటికే ఇక్కడ ఓ ఎయిర్ బేస్ ఉండగా, దాన్ని ప్రస్తుత అవసరాలకు తగిన విధంగా పునర్ నిర్మిస్తోంది.

వాస్తవాధీన రేఖకు అత్యంత చేరువలో ఉండే షాక్చే (షింజియాంగ్ ప్రావిన్స్) పట్టణంలో ఈ ఎయిర్ బేస్ ఏర్పాటవుతోంది.  ఇక్కడి నుంచి యుద్ధ విమాన కార్యకలాపాలు సాగించాలన్నది చైనా ప్రణాళిక. వాస్తవాధీన రేఖ వెంబడి చైనాకు కష్గర్, హోగన్ ఎయిర్ బేస్ లు ఉండగా, వాటి మధ్య దూరం 400 కిలోమీటర్లు. ఇప్పుడు ఆ రెండింటి మధ్యలో తాజా ఎయిర్ బేస్ నిర్మాణం చేపడుతోంది. దాంతో వాస్తవాధీన రేఖ పొడవునా చైనా యుద్ధ విమానాల కార్యకలాపాలు ఎంతో సులభతరం అవుతాయి. త్వరలోనే షాక్చే ఎయిర్ బేస్ నుంచి చైనా ఫైటర్ జెట్ల కార్యకలాపాలు షురూ అవుతాయని రక్షణ రంగ వర్గాలంటున్నాయి.

కాగా, భారత నిఘా వర్గాలు ఈ కొత్త ఎయిర్ బేస్ పై ఓ కన్నేసి ఉంచాయి. ఎల్ఏసీ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే... భారత్ తో పోల్చితే చైనా వాయుసేన సన్నద్ధత ఈ ప్రాంతంలో బలహీనం అని చెప్పాలి. ఈ ప్రాంతంలో భారత్ అనేక స్వల్ప నిడివి ఎయిర్ బేస్ లు నిర్మించింది. దాంతో ఏ ప్రాంతం నుంచైనా యుద్ధ విమానాలను అతి తక్కువ సమయంలో మోహరించే వీలుంటుంది. ఈ ప్రాంతంలో భారత్ సత్తా ఎలాంటిదంటే... ఏకకాలంలో చైనా, పాకిస్థాన్ లతో పోరాడాల్సి వచ్చినా లడఖ్ ప్రాంతంలోని ఎయిర్ బేస్ ల నుంచి తగిన సంఖ్యలో యుద్ధ విమానాలను పంపే వీలుంది.

More Telugu News