వచ్చే ఏడాది రానున్న మణిరత్నం సినిమా తొలిభాగం

19-07-2021 Mon 21:09
  • మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియన్ సెల్వన్'
  • ముఖ్య పాత్రలలో ఐశ్వర్య, విక్రమ్, కీర్తి సురేశ్
  • రెండు భాగాలుగా రూపొందుతున్న సినిమా  
Maniratnams Ponnian Selvan first part to be released next year

ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం సినిమాలకు ప్రేక్షకులలో ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. దక్షిణాది సినిమాను కొత్తపుంతలు తొక్కించిన దర్శకుడాయన. వెండితెరకు సాంకేతిక సొబగులు అద్దిన క్రియేటర్. బాక్సాఫీసు జయాపజయాలతో సంబంధం లేకుండా నిలిచిపోయే సినిమాలు రూపొందించే దర్శకుడు. అందుకే, ఆయన ఫ్లాప్ సినిమాని కూడా పనిగట్టుకుని వెళ్లి మరీ చూసే ప్రేక్షకులున్నారు.

అలాంటి మణిరత్నం తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక కథా చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. సుప్రసిద్ధ తమిళ రచయిత కల్కి రాసిన 'పొన్నియన్ సెల్వన్' నవలను అదే పేరుతో మణిరత్నం తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్య రాయ్, కీర్తి సురేశ్, విక్రమ్, జయం రవి వంటి ప్రముఖ నటులు నటిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.

ఈ క్రమంలో 'పీఎస్-1' పేరిట రూపొందుతున్న తొలిభాగాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ ఈ రోజు సంయుక్తంగా ప్రకటించాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్ ని కూడా ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ భారీ ప్రాజక్టుకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.