సానుభూతి కోసమే ఈటల చిల్లర ఆరోపణలు చేస్తున్నారు: మంత్రి గంగుల

19-07-2021 Mon 21:04
  • తన హత్యకు కుట్ర జరుగుతోందన్న ఈటల
  • ఓటమి భయంతో మాట్లాడుతున్నారన్న గంగుల
  • దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శలు
  • అవసరమైతే తన ప్రాణం అడ్డువేస్తానని వెల్లడి
Gangula Kamalakar strongly condemns Eatala allegations

హుజూరాబాద్ ఉప ఎన్నికలో చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. తన హత్యకు ఒక మంత్రి కుట్ర చేస్తున్నారని అన్నారు. దీనిపై జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈటల దిగజారుడు రాజకీయాలకు ఈ వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారు. ఎన్నికల్లో సానుభూతి పొందడం కోసమే ఈటల ఈ విధంగా చిల్లర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

ఒకవేళ ఈటల ప్రాణానికి ముప్పు ఏర్పడితే తన ప్రాణం అడ్డువేస్తానని గంగుల వ్యాఖ్యానించారు. ఈటల వ్యాఖ్యల్లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఎలాగూ ఈటల బీజేపీలోనే ఉన్నారని, తనపై నిజంగానే కుట్ర జరుగుతుంటే సీబీఐ, ఎన్ఐఏ సంస్థలతో విచారణ జరిపించుకోవచ్చని గంగుల సలహా ఇచ్చారు.