Pravin Kumar: స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తెలంగాణ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్

  • ప్రవీణ్ కుమార్ కీలక నిర్ణయం
  • గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి పదవికి గుడ్ బై
  • కొత్త జీవితం ప్రారంభిస్తున్నట్టు వెల్లడి
  • సామాజిక న్యాయం కోసం కృషి చేస్తానని వివరణ
Telangana IPS Pravin Kumar voluntarily retired

స్వేరోయిజానికి ఆద్యుడు, తెలంగాణ ఐపీఎస్ అధికారి, రాష్ట్ర గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తన రాజీనామా లేఖను తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కు పంపించినట్టు ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఓవైపు బాధ, మరోవైపు ఆనందం కలగలిసిన భావాల నడుమ తన 26 ఏళ్ల కెరీర్ కు గుడ్ బై చెబుతున్నానని తెలిపారు. ఐపీఎస్ అధికారి అవ్వాలనేది తన ఆశయం అని, ఆ స్థాయిని అందుకున్న తాను ఇప్పుడు ఓ కఠిన నిర్ణయం తీసుకున్నానని వివరించారు. ఇదేమంత సులభమైన నిర్ణయం కాదని పేర్కొన్నారు.

ఈ క్రమంలో తనకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన కుటుంబానికి రుణపడి ఉంటానని ప్రవీణ్ కుమార్ తెలిపారు. బంధుమిత్రులు, గురువులు, సహచరులు, విద్యార్థులు, ప్రజానీకం, ప్రజాప్రతినిధులు, ఎన్జీవోలు... ఇలా ఎందరో తన వ్యక్తిత్వాన్ని మలిచారని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వివరించారు. బడుగు, బలహీన వర్గాలకు సేవలు అందించేలా తనకు అవకాశాలు ఇచ్చిన ఉమ్మడి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ధన్యవాదాలు అంటూ తన లేఖలో పేర్కొన్నారు.

పోలీసులకు, సంక్షేమ విభాగాలకు, గురుకుల పాఠశాలల సిబ్బందికి, గురుకుల పాఠశాలల విద్యార్థులు (స్వేరోస్) అందరికీ వేనవేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. ఇకపై తన శేష జీవితాన్ని మహాత్మా పూలే దంపతులు, అంబేద్కర్, కాన్షీరామ్ వంటి మార్గదర్శకుల ఆశయాలకు అనుగుణంగా కొనసాగిస్తానని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. తన జీవితంలో కొత్త దశ ప్రారంభం అవుతోందని, అందరి ఆశీస్సులు కావాలని తెలిపారు.

ఎంతో ఆదర్శభావాలున్న వ్యక్తిగా ప్రవీణ్ కుమార్ గుర్తింపు పొందారు. అయితే హిందుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ గతంలో ఆయనపై వివాదం వచ్చింది.

More Telugu News