Insider Trading: ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంలో విచారణ

Amaravathi insider trading case hearing in Supreme Court
  • ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సుప్రీంలో ఏపీ సర్కారు పిటిషన్
  • నేటి విచారణలో వాదోపవాదాలు
  • ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ చట్టం అమల్లో ఉందన్న ప్రభుత్వం
  • ఈ చట్టం వర్తించదన్న ప్రతివాదుల న్యాయవాదులు
అమరావతి భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఏపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీ హైకోర్టు ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను తోసిపుచ్చింది. ఈ అంశంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్ నేడు విచారణ జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. అమరావతిలో ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చట్టం అమలవుతోందని దవే సుప్రీంకోర్టుకు తెలిపారు. ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చట్టం కింద కొనుగోలుదార్లకు వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా ఇదే అంశాన్ని పలుమార్లు ధ్రువీకరించాయని అన్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో అనేక లోపాలున్నట్టు తెలుస్తోందని దవే ఏపీ ప్రభుత్వం తరఫున అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించారు. ప్రస్తుతం ఈ కేసు ప్రాథమిక విచారణ దశలోనే ఉందని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, 2019లో ప్రభుత్వం మారిన తర్వాతే ఫిర్యాదులు అందాయని దవే స్పష్టం చేశారు.

కాగా, ప్రభుత్వ వాదనలతో ప్రతివాదుల తరఫు న్యాయవాదులు విభేదించారు. అమరావతిలో అక్రమాలు జరిగాయని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదని ఓ ప్రతివాది తరఫు న్యాయవాది ఖుర్షీద్ స్పష్టం చేశారు. ఒక్కరు కూడా ఫిర్యాదు చేయనప్పుడు విచారణ జరపాల్సిన అవసరం ఏముందని అన్నారు. అసలు ఈ కేసులో ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ చట్టం వినియోగంలోకి రాదని పేర్కొన్నారు. ఇద్దరి మధ్య వ్యవహారంలో మోసం జరిగిందా? లేదా? అనే అంశాలు ఈ చట్టం పరిధిలోకి రావని వివరించారు.

రాజధాని ఎక్కడన్న అంశం 2014 అక్టోబరు నుంచి మీడియాలో వచ్చిందని ఖుర్షీద్ సుప్రీంకోర్టుకు తెలిపారు. 14 గ్రామాల్లో 30 వేల ఎకరాల పరిధిలో రాజధాని వస్తుందని కథనాలు వచ్చాయని వివరించారు. 2014 డిసెంబరు 30న రాజధానిపై అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని ఖుర్షీద్ పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారని స్పష్టం చేశారు.

మరో ప్రతివాది తరఫున శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. రాజధాని భూములపై హైకోర్టు అన్నీ పరిశీలించే తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఆరేళ్ల తర్వాత భూములమ్మిన వారి తరఫున ఎవరో ఫిర్యాదు చేశారని వెల్లడించారు. అంతేతప్ప భూములు అమ్మినవారు ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. స్థానికులు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్న అంశం హైకోర్టు ఉత్తర్వుల ద్వారా తెలుస్తుందని దివాన్ వివరించారు. ఈ కేసులో ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ చట్టం సెక్షన్-55 వర్తించదని అన్నారు. రాజధాని ఏర్పాటు అంతా బహిరంగంగానే జరిగిందని సుప్రీం ధర్మాసనానికి నివేదించారు.
Insider Trading
Supreme Court
YSRCP
TDP
Amaravati
Andhra Pradesh

More Telugu News