Etela Rajender: నన్ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారు: ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

  • నన్ను చంపేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి ప్రయత్నిస్తున్నాడు
  • నయీమ్ బెదిరించినప్పుడే నేను భయపడలేదు
  • దళితుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు
TRS is trying to kill me says Etela Rajender

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఈరోజు తన హుజూరాబాద్ నియోజకర్గంలో పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తనను చంపడానికి జిల్లాకు చెందిన ఒక మంత్రి కుట్ర చేస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్య కోసం హంతక ముఠాతో చేతులు కలిపాడని అన్నారు.

 'అరేయ్ కొడకల్లారా... నన్ను చంపుతానని నయీం బెదిరించినప్పుడే నేను భయపడలేదు. ఈ చిల్లర ప్రయత్నాలకు కూడా భయపడను' అని చెప్పారు. ఉగ్గుపాలతోనే ఉద్యమాలు చేసిన చరిత్ర తనదని అన్నారు. ఆత్మ గౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లాడతామని చెప్పారు.

దళితబంధు పథకాన్ని పెట్టడం సంతోషమేనని... అయితే, దళితులకు మూడు ఎకరాల భూమిని ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ఈటల ప్రశ్నించారు. దళితుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. కేవలం ఎన్నికల కోసం పథకాలను తీసుకురావద్దని అన్నారు. రెండేళ్లుగా ఇవ్వని రేషన్ కార్డులు, పెన్షన్లని ఇప్పుడు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఫాంహౌస్ లో ఉన్న కేసీఆర్ ను ప్రజల మధ్యకు తీసుకొచ్చింది మనమేనని అన్నారు.

దుబ్బాక ఉపఎన్నికలో వచ్చిన ఫలితమే హుజూరాబాద్ ఉపఎన్నికలో కూడా వస్తుందని ఈటల జోస్యం చెప్పారు. తన ఇంటికి వచ్చిన వారిని ఏ కులం, ఏ మతం అని తాను ఏనాడూ అడగలేదని... ఏం కష్టం వచ్చిందని అడిగి సహాయం చేశానని అన్నారు. 2018 ఎన్నికల్లోనే తనను ఓడించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం చేసిందని... అయితే ప్రజలు తనకు అండగా నిలిచారని చెప్పారు. ఇప్పుడు కూడా నియోజకవర్గ ప్రజలు తనకు అండగానే ఉన్నారని అన్నారు. పోలీసులు వారి విధులను సక్రమంగా నిర్వహించాలని ఈటల కోరారు.

More Telugu News