వైసీపీ ఎంపీల ఆందోళన... రాజ్యసభ రేపటికి వాయిదా

19-07-2021 Mon 15:41
  • ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
  • రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా నినాదాలు
  • చర్చకు పట్టుబట్టిన వైసీపీ ఎంపీలు
  • చైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లిన వైనం
Rajyasabha adjourned for tomorrow

ఇవాళ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా, తొలిరోజే ఉభయ సభల్లోనూ విపక్ష సభ్యుల ఆందోళనలతో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై చర్చించాలని రాజ్యసభలో వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. నినాదాలు చేస్తూ చైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. రాజ్యసభ చైర్మన్ సూచనలను వారు పట్టించుకోకపోవడంతో రేపు ఉదయం 11 గంటల వరకు సభను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అంతకుముందు, సభా ప్రారంభంలో చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రసంగించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ప్రజోపయోగ అంశాల కోసం ఉపయోగించుకోవాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి సభ్యుడు మెలగాలని పిలుపునిచ్చారు.

కాగా, సభ ప్రారంభమైన తర్వాత... వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి రూల్ 267 కింద రాజ్యసభ చైర్మన్ కు నోటీసు ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తక్షణమే చర్చ చేపట్టాలని కోరారు. రాజ్యసభలో ఈరోజు నిర్వహించే అన్ని కార్యక్రమాలను రద్దు చేసి ప్రత్యేకహోదా అంశంపై చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.