Hyderabad: హైదరాబాద్-విజయవాడ రహదారిపై 2 గంటల పాటు ఆగిపోయిన ట్రాఫిక్

  • దండు మల్కాపూర్ వద్ద వృద్ధురాలిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
  • ఈ ఘటనలో అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన వృద్ధురాలు
  • మృతదేహంతో రోడ్డుపై ఆందోళన చేపట్టిన గ్రామస్థులు 
2 hours traffic jam on Hyderabad Vijayawada highway

తెలంగాణలోని యాదాద్రి జిల్లా దండు మల్కాపూర్ వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. కరోనా టీకా వేయించుకోవడానికి వెళ్తున్న యాదమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలిని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన పట్ల తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్థులు రహదారిపై ఆందోళనకు దిగారు.

మృతదేహాన్ని రోడ్డుపైనే ఉంచి రాస్తారోకో నిర్వహించారు. అండర్ పాస్ బ్రిడ్జి లేని కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు మండిపడ్డారు. ఈ ఆందోళన నేపథ్యంలో ఇరువైపులా దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాద స్థలి వద్దకు వచ్చిన ఏసీపీ శంకర్ ఆందోళనకారులతో మాట్లాడారు. అనంతరం గ్రామస్థులు ఆందోళనను విరమించారు. ఆ తర్వాత నెమ్మదిగా వాహనాలు కదిలాయి.

More Telugu News