Supreme Court: ప్రజలు ఆహుతైపోతారు.. గుజరాత్​ సర్కార్​ నిర్ణయంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court Fires On Gujarat Govt Notification
  • మేం ఇచ్చిన ఆదేశాలే ఫైనల్
  • వాటిని కాదని నోటిఫికేషనా?
  • ఫైర్ సేఫ్టీపై 2022 దాకా అవకాశమా?
  • ఆసుపత్రులు రియల్ ఎస్టేట్ సంస్థల్లా మారాయి
గుజరాత్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను కాదని ఆసుపత్రుల్లో అగ్నిప్రమాద నివారణ చర్యలు చేపట్టేందుకు మరింత సమయమిచ్చేలా నోటిఫికేషన్ జారీ చేయడంపై జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్ని అగ్నిప్రమాదాలు జరిగినా.. ఆసుపత్రులకు ఇంకా టైమివ్వడమేంటని ప్రశ్నించింది. ప్రభుత్వ నోటిఫికేషన్ అక్రమాలను కాపాడుతున్నట్టుగా ఉందని అసహనం వ్యక్తం చేసింది. ఇలాగైతే ప్రజలు నిలువునా కాలి చనిపోతారని మండిపడింది.

‘‘ఒక్కసారి మేం ఆదేశాలిచ్చాక వాటిని కాదని.. ఇలాంటి నోటిఫికేషన్ ఇవ్వరాదు. మీ ఉద్దేశం ప్రకారం 2022 వరకూ మేమిచ్చిన ఆదేశాలను ఆసుపత్రులు పాటించనవసరం లేదనా? ప్రజలు మంటల్లో కాలి బూడిదవ్వాలనుకుంటున్నారా?’’ అని జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నిలదీశారు.

మహారాష్ట్రలోని నాశిక్ ఆసుపత్రిలో ఇంకొక్క రోజులో డిశ్చార్జ్ కావాల్సిన పేషెంట్, బాత్రూంకు వెళ్లిన ఇద్దరు నర్సులు మంటల్లో ఆహుతయ్యారని గుర్తు చేశారు. అలాంటివి మరెన్నో ఘటనలు మన కళ్ల ముందే జరిగాయని, ఆసుపత్రులు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల్లా మారాయని మండిపడ్డారు. నాలుగు గదుల్లో నిర్వహిస్తున్న అక్రమ ఆసుపత్రులన్నింటినీ మూసేయాల్సిందేనని తేల్చి చెప్పారు.

దీనిపై ప్రభుత్వ స్పందనను తెలియజేయాలని, సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. దానికి మరింత సమయం కావాలని గుజరాత్ సర్కార్ కోరినా.. నోటిఫికేషన్ పై ఏదో ఒకటి ఇవ్వాళే తేల్చాలని జస్టిస్ ఎంఆర్ షా ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లను 2022 నాటికి చేసుకోవచ్చని పేర్కొంటూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని వార్తల్లో చూసి తెలుసుకున్నామని, దానిపై స్పందించాలని స్పష్టం చేశారు.
Supreme Court
Gujarat
COVID19
Hospitals

More Telugu News