సంప్రదాయాన్ని ప్రతిపక్షాలు అగౌరవపరిచాయి: పీయూష్​ గోయల్​

19-07-2021 Mon 14:28
  • కొత్త మంత్రుల పరిచయం అనాదిగా వస్తున్న ఆచారం
  • నెహ్రూ హయాం నుంచే ఉంది
  • అడ్డుకోవడం పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి
It is Decade Old Tradition Piyush Goel slams Oppn

ప్రతిపక్షాల తీరుపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాకాల సమావేశాల సందర్భంగా ఇవ్వాళ ఆయన రాజ్యసభలో మాట్లాడారు. మంత్రి వర్గ విస్తరణ జరిగినప్పుడు, కొత్త వారిని కేబినెట్ లోకి తీసుకున్నప్పుడు.. వారిని సభకు పరిచయం చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయమని, జవహర్ లాల్ నెహ్రూ హయాం నుంచే ఈ ఆచారం కొనసాగుతోందని గుర్తు చేశారు.

కానీ, ఆ సంప్రదాయాన్ని ఇప్పుడు ప్రతిపక్షాలు అగౌరవ పరిచాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల తీరును ఖండిస్తున్నట్టు చెప్పారు. రాజ్యసభ చైర్మన్ ప్రసంగాన్ని అడ్డుకోవడం వారి దుష్ట సంప్రదాయానికి నిదర్శనమన్నారు. ఇలాంటి సంప్రదాయాలను అడ్డుకోవడం పార్లమెంట్ చరిత్రలోనే మొదటిసారని మండిపడ్డారు. కొత్త మంత్రులను సభకు పరిచయం చేయనివ్వకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.