Prime Minister: మహిళలు, బలహీన వర్గాలకు మంత్రి పదవులు దక్కడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు!: ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ విసుర్లు

  • వారంతా మహిళా వ్యతిరేకులు
  • ఇలాంటి వారిని నేనెన్నడూ చూడలేదు
  • మంత్రుల పరిచయాన్ని ఆమోదించిన ఉభయ సభలు
Modi Fires Over Opposition

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజునే ప్రతిపక్షాలు రచ్చ చేశాయి. కొత్త మంత్రులను సభకు ప్రధాని నరేంద్ర మోదీ పరిచయం చేసే క్రమంలో ప్రతిపక్ష ఎంపీలు నానా యాగీ చేశారు. వారిని పరిచయం చేసేందుకు మోదీ లేచీలేవంగానే నినాదాలతో హోరెత్తించారు. ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. దీంతో ప్రధాని మోదీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలకు మంత్రులుగా అవకాశం రావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. వారంతా మంత్రులుగా ప్రమాణం చేయడాన్ని ప్రతి ఒక్కరూ గౌరవంగా, గర్వంగా భావించాలని అన్నారు. కొత్త మంత్రుల్లో కొందరు రైతుల బిడ్డలున్నారని, మరికొందరు ఓబీసీ వర్గాలకు చెందిన వారని ఆయన చెప్పారు.

ఆ తర్వాత రాజ్యసభలోనూ ప్రతిపక్షాల నుంచి అదే నిరసన ఎదురైంది. దీంతో గ్రామీణ ప్రాంతాల వారు, సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారు మంత్రులవడాన్ని గౌరవంగా భావించాలన్నారు. కానీ, మహిళా వ్యతిరేక భావాలున్న కొందరు.. మహిళా మంత్రులను పరిచయం చేయకుండా అడ్డుకుంటున్నారని, పార్లమెంట్ లో అలాంటి వారిని తానెప్పుడూ చూడలేదని అసహనం వ్యక్తం చేశారు.  

కొత్తగా మంత్రులైన వారి జాబితాను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు అందజేసిన ప్రధాని.. వారిని పరిచయం చేసే అవకాశం కల్పించవలసిందిగా   కోరారు. దానిని ఆమోదిస్తున్నట్టు ఉభయ సభలు ప్రకటించాయి.
 
ఆ తర్వాత కూడా ప్రతిపక్షాలు పదే పదే రభస చేయడంతో లోక్ సభను స్పీకర్ 2 గంటల వరకు వాయిదా వేశారు. ‘‘మీరు కూడా ఒకప్పుడు అధికారంలో ఉన్నారు కదా. సభ గౌరవాన్ని దిగజార్చకండి. మంచి సంప్రదాయాన్ని మీరు నాశనం చేస్తున్నారు. కొంచెం సభా మర్యాద పాటించండి’’ అని ప్రతిపక్ష ఎంపీలకు ఆయన సూచించారు. కొత్త మంత్రులను పరిచయం చేయనివ్వకుండా ప్రతిపక్షాలు అడ్డుకోవడం 24 ఏళ్ల చరిత్రలో ఇదే ప్రథమమని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మండిపడ్డారు.

More Telugu News