నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్ద నక్కా ఆనంద్ బాబు నిరసన

19-07-2021 Mon 14:04
  • జగన్ నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించిన విద్యార్థి నేతలు
  • అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
  • స్టేషన్ కు వెళ్లి విద్యార్థులను పరామర్శించిన ఆనంద్ బాబు
Nakka Anand Babu protests at Nallapadu police station

కొత్త జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ యువజన, విద్యార్థి సంఘాల నేతలు ఛలో తాడేపల్లికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. దీంతో, విద్యార్థి నేతలను పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో ఆ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు... యువజన సంఘాల నేతలను పరామర్శించారు.

అనంతరం మీడియాతో మాట్లాడేందుకు నక్కా ఆనంద్ బాబు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరును నిరసిస్తూ పోలీస్ స్టేషన్ గేటు వద్ద ఆయన బైఠాయించారు. పోలీసుల తీరును వ్యతిరేకస్తూ ఆందోళన తెలిపారు. మరోవైపు నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ ప్రేమయ్య తీరుపై విద్యార్థి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఐ అక్రమంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమ పట్ల ప్రవర్తించిన తీరుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.