కఠిన ప్రశ్నలు ఎన్నైనా వేయండి.. కానీ, మమ్మల్ని మాట్లాడనివ్వండి: విపక్షాలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి

19-07-2021 Mon 12:04
  • క్రమశిక్షణతో మెలగాలని హితవు
  • టీకాతో ‘బాహుబలి’ అవ్వాలని ప్రజలకు పిలుపు
  • 40 కోట్ల మంది బాహుబలులయ్యారని చమత్కారం
Ask Difficult Questions But Let Us Respond PM Modi Urges Opposition

ప్రతిపక్షాలు కఠిన ప్రశ్నలను ఎన్నైనా సంధించొచ్చని, కానీ, వాటికి జవాబు చెప్పేందుకు ప్రభుత్వాన్ని మాట్లాడనివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. అందరు ఎంపీలు, అన్ని విపక్షాలు అత్యంత కఠినమైన, తెలివైన ప్రశ్నలను సంధించాలని కోరుతున్నానన్నారు. వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ బయట ఆయన మీడియాతో మాట్లాడారు. సభలో క్రమశిక్షణతో మెలగాలని ప్రతిపక్ష సభ్యులకు హితవు చెప్పారు. అలాగైతేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని, ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని, అభివృద్ధిలో వేగం పుంజుకుంటుందని ఆయన చెప్పారు.

వ్యాక్సినేషన్ పైనా తనదైన శైలిలో మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారంతా బాహుబలులేనని చమత్కరించారు. ‘‘టీకాను భుజాలకు (బాహువు) వేస్తారు. కాబట్టి, టీకాలేసుకున్న వారంతా బాహుబలులు. ఇప్పటికే 40 కోట్ల మంది బాహుబలులయ్యారు. మిగతా వారూ టీకా తీసుకుని బాహుబలి అవ్వాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను విధిగా పాటించాలని సూచించారు. ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి గుప్పిట పట్టేసిందని, సభలో దానిపై అర్థవంతమైన చర్చలు జరగాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.