ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్... తొలి వన్డేలో శ్రీలంకపై టీమిండియా గెలుపు

18-07-2021 Sun 22:19
  • కొలంబోలో భారత్, శ్రీలంక మధ్య తొలివన్డే
  • 7 వికెట్ల తేడాతో భారత్ విజయం
  • 263 లక్ష్యాన్ని 3 వికెట్లకు ఛేదించిన వైనం
  • ధావన్ 86 నాటౌట్
  • ధాటిగా ఆడిన ఇషాన్ కిషన్, పృథ్వీ షా
Team India comprehensive victory against Sri Lanka in first ODI

శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ లో భారత్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కొలంబో ప్రేమదాస స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 263 పరుగుల లక్ష్యాన్ని భారత్ 36.4 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ కు మూలస్తంభంలా నిలిచాడు. ధావన్ 86 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అంతకుముందు ఓపెనర్ పృథ్వీ షా (24 బంతుల్లో 43 రన్స్), ఇషాన్ కిషన్ (42 బంతుల్లో 59 రన్స్) దూకుడు ప్రదర్శించారు. మనీష్ పాండే 26 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 31 పరుగులతో అజేయంగా నిలిచాడు.  లంక బౌలర్లలో ధనంజయ డి సిల్వా 2 వికెట్లు తీయగా, లక్షన్ సందాకన్ ఒక వికెట్ సాధించాడు.

అంతకుముందు ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 262 పరుగులు చేసింది. లంక జట్టులో అత్యధికంగా కరుణరత్నె 43 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా తరఫున సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేశారు. కాగా, ఈ మ్యాచ్ లో విజయంతో భారత్ 3 వన్డేల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే జులై 20న ఇదే స్టేడియంలో జరగనుంది.