ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పదు: ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి

18-07-2021 Sun 17:36
  • ఏపీ ఫైబర్ నెట్ లో స్కాం జరిగిందన్న గౌతమ్ రెడ్డి
  • చంద్రబాబు అవకతవకలు బయటికి వస్తాయని వ్యాఖ్యలు
  • త్వరలో సీఐడీ పేర్లు వెల్లడిస్తుందన్న వ్యాఖ్యలు 
  • ఫైబర్ నెట్ రుణాన్ని తాము తీర్చేస్తామని వెల్లడి
Goutham Reddy comments on Chandrababu

ఏపీ ఫైబర్ నెట్ లో కుంభకోణం జరిగిందని చైర్మన్ గౌతమ్ రెడ్డి అన్నారు. ఫైబర్ నెట్ లో జరిగిన అవినీతిని వెలికి తీస్తున్నామని, సీఐడీ రేపో మాపో పేర్లతో సహా అక్రమార్కుల బండారం బట్టబయలు చేస్తుందని తెలిపారు. 2జీ స్పెక్ట్రమ్ తరహాలో చంద్రబాబు అండ్ కో చేసిన అవకతవకలన్నీ బయటికి వస్తాయని పేర్కొన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పదని గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు.

చంద్రబాబు కారణంగా ఏపీ ఫైబర్ నెట్ రూ.650 కోట్ల మేర అప్పులపాలైందని ఆరోపించారు. వచ్చే ఏడాది నాటికి ఆ అప్పు అంతటినీ తీర్చేస్తామని అన్నారు. 2021 డిసెంబరు కల్లా ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్ పార్కులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.