పాకిస్థాన్‌లో ఆఫ్ఘనిస్థాన్ రాయబారి కుమార్తెను కిడ్నాప్ చేసి చిత్రహింసలు!

18-07-2021 Sun 09:17
  • రాజధాని ఇస్లామాబాద్‌లో వాహనంలో వెళ్తుండగా కిడ్నాప్
  • ఏడు గంటలపాటు చిత్రహింసలు
  • తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆప్ఘనిస్థాన్
Afghanistan says envoys daughter kidnapped tortured in Pakistan

పాకిస్థాన్‌లో అత్యున్నతస్థాయి అధికారులకు కూడా రక్షణ లేకుండా పోతోంది. ఆఫ్ఘనిస్థాన్ రాయబారి కుమార్తెను మొన్న అపహరించిన దుండగులు చిత్రహింసలు పెట్టారు. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. రాజధాని ఇస్లామాబాద్‌లోని రానా మార్కెట్‌లో శుక్రవారం ఓ ప్రైవేటు వాహనంలో వెళ్తున్న రాయబారి కుమార్తె సిల్సిలా అలీ ఖిల్ (26)ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఆపై గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి ఏడు గంటలపాటు చిత్ర హింసలకు గురిచేశారు.

తీవ్రగాయాలపాలైన ఆమెను నగరంలోని ఎఫ్-9 మార్కెట్ ప్రాంతంలో వదిలిపెట్టారు. గుర్తించిన అధికారులు ఆమెను వెంటనే పాకిస్థాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. సిల్సిలా కిడ్నాప్‌పై ఆఫ్ఘనిస్థాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నిందితులను పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేసింది. కాగా, ఈ ఘటనపై ఇస్లామాబాద్ పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించినట్టు పాకిస్థాన్ విదేశాంగ శాఖ తెలిపింది.