మహారాష్ట్రలో విషాదం.. కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి

18-07-2021 Sun 09:00
  • కొండచరియలు విరిగిపడి ఐదు ఇళ్లు ధ్వంసం
  • శిథిలాల కింద మరికొందరు
  • 16 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు
  • మరో ఘటనలో ముగ్గురి మృత్యువాత
11 killed in separate incidents of wall collapse in Mumbai amid heavy rains

ముంబైలోని చెంబూరులో విషాదం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగి ఇళ్లపై పడడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాల కారణంగా విరిగిపడిన కొండచరియలు స్థానిక భరత్‌నగర్ ప్రాంతంలోని ఇళ్లపై పడ్డాయి. దీంతో ఆ ఇళ్లలో నివసిస్తున్న 11 మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ దళాలు శిథిలాల నుంచి 16 మందిని రక్షించాయి.

శిథిలాల కింద గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 5 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. శిథిలాల కింద మరో 8 మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. కాగా, ముంబైలోని విక్రోలీ ప్రాంతంలో ఓ భవనం కూలిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఇక్కడ కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.