Rats: ఆపరేషన్ కోసం దాచుకున్న రూ. 2 లక్షలు ఎలుకల పాలు.. ముక్కలు చేసిన మూషికాలు!

Rats destroy worth Rs 2 lakh currency notes in Mahabubabad dist
  • కడుపులో కణతికి ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బులు
  • బోరున విలపిస్తున్న బాధితుడు
  • రిజర్వు బ్యాంకుకు వెళ్లాలన్న స్థానిక బ్యాంకు అధికారులు
కడుపులో కణతికి శస్త్రచికిత్స చేయించుకునేందుకు కూడబెట్టుకున్న 2 లక్షల రూపాయల సొమ్మును ఎలుకలు కొట్టేసి పనికిరాకుండా చేశాయి. దీంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా వేంనూరు శివారులోని ఇందిరానగర్ కాలనీతండాలో జరిగిందీ ఘటన. స్థానికంగా నివసిస్తున్న భూక్య రెడ్యా కడుపులో కణతితో బాధపడుతున్నాడు. దానిని శస్త్రచికిత్స చేసి తొలగించేందుకు రూ. 4 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. కూరగాయల వ్యాపారం చేసే రెడ్యా.. ఓవైపు బాధను భరిస్తూనే కూరగాయలు అమ్ముతూ డబ్బులు కూడబెడుతూ వస్తున్నాడు.

దీనికి తోడు కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకొచ్చి మొత్తం రూ. 2 లక్షలను బీరువాలో భద్రపరిచాడు. మంగళవారం ఆసుపత్రికి వెళ్లేందుకు సిద్ధమైన రెడ్యా బీరువాలోని డబ్బులను చూసి హతాశుడయ్యాడు. ఎలుకలు వాటిని ముక్కలుముక్కలుగా కొట్టేయడంతో లబోదిబోమన్నాడు. ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బులు పనికిరాకుండా పోవడంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆ డబ్బును తీసుకుని గత నాలుగు రోజులుగా మహబూబాబాద్‌లోని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. రిజర్వు బ్యాంకును సంప్రదించాలని చెప్పిన అధికారులు.. అక్కడ కూడా పని జరుగుతుందని చెప్పలేమని అనుమానం వ్యక్తం చేయడంతో బాధితుడు భూక్య కన్నీటి పర్యంతమయ్యాడు. 
Rats
Currencey
RBI
Telangana
Mahabubabad District

More Telugu News