ఆదిత్య 369 ఇంకా ఆదరణ పొందుతున్నందుకు గర్వంగా ఉంది: బాలకృష్ణ

17-07-2021 Sat 21:35
  • ఆదిత్య 369 విడుదలై 30 ఏళ్లు
  • సోషల్ మీడియాలో స్పందించిన బాలయ్య
  • ఈ తరాన్ని కూడా ఆకర్షిస్తోందని వెల్లడి
  • దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు
Balakrishna remembers his scientific thriller movie

నందమూరి బాలకృష్ణ, మోహిని జంటగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన టైమ్ మెషీన్ కాన్సెప్టు మూవీ 'ఆదిత్య 369' తెలుగు సినీ చరిత్రలో ఓ విలక్షణ చిత్రంగా నిలిచిపోతుంది. కాగా, తాను నటించిన ఈ చిత్రం విడుదలై 30 ఏళ్లు దాటినా ఇంకా ప్రజాదరణ పొందుతోందని బాలకృష్ణ వెల్లడించారు. ఆదిత్య 369 సినిమా డిజిటల్ మీడియాలో ఈ తరాన్ని కూడా ఆకర్షిస్తున్నందుకు గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచ సినీ చరిత్రలో సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ, చరిత్ర... ఈ మూడు జోనర్లను మేళవించి తెరకెక్కించిన అతి తక్కువ చిత్రాల్లో మనదేశం నుంచి బహుశా ఇదొక్కటేనేమో అని అభిప్రాయపడ్డారు.

"ఇంతటి చిరస్మరణీయ దృశ్య కావ్యానికి నన్ను కథానాయకుడ్ని చేసిన దర్శకశాస్త్రవేత సింగీతం శ్రీనివాసరావు గారికి, నిర్మాతలు స్వర్గీయ ఎస్పీ బాలు, కృష్ణప్రసాద్ గారికి, నా ఊపిరితో సమానమైన అభిమానులకు, తరం మారినా ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు సదా కృతజ్ఞుడ్ని" అంటూ సోషల్ మీడియాలో స్పందించారు.