నన్ను కేసీఆర్ మోసం చేశాడని ప్రజలు నమ్ముతున్నారు: ఈటల రాజేందర్

17-07-2021 Sat 16:06
  • హుజూరాబాద్ ఉపఎన్నిక అహంకారాన్ని ఓడించడానికి జరుగుతున్న ఎన్నిక
  • తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ వ్యతిరేకత ఉంది
  • రాష్ట్ర ప్రజలందరూ హుజూరాబాద్ వైపు చూస్తున్నారు
People are believing that KCR deceived me says Etela Rajender

హుజూరాబాద్ ఉపఎన్నిక న్యాయం, ధర్మాన్ని కాపాడుకోవడానికి, అహంకారాన్ని ఓడించడానికి జరుగుతున్న ఎన్నిక అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేసినా గెలిచేది బీజేపీనే అని చెప్పారు. కేవలం హుజూరాబాద్ లో మాత్రమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ వ్యతిరేకత ఉందని అన్నారు. చిల్లర రాజకీయాలను తెలంగాణ ప్రజలు అంగీకరించరని చెప్పారు. ప్రజల్లో బలం ఉందని చెప్పుకుంటున్న టీఆర్ఎస్... చిల్లర రాజకీయాలు ఎందుకు చేస్తోందని ఎద్దేవా చేశారు.

హుజూరాబాద్ లో కోట్లాది రూపాయలను టీఆర్ఎస్ ఖర్చు చేస్తోందని.. కుల సంఘం భవనాలను కట్టిస్తామంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని ఈటల మండిపడ్డారు. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా టీఆర్ఎస్ ను ప్రజలు నమ్మబోరని... ఈటల రాజేందర్ ను కేసీఆర్ మోసం చేశాడని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. యావత్ తెలంగాణ ప్రజలు హుజూరాబాద్ ఉపఎన్నిక వైపు చూస్తున్నారని అన్నారు. ఆత్మగౌరవాన్ని గెలిపించుకుందామని హుజూరాబాద్ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణలో ఎస్సీల జనాభా 17 శాతం వరకు ఉందని... కానీ మంత్రి వర్గంలో వారి ప్రాతినిధ్యం చాలా దారుణంగా ఉందని ఈటల విమర్శించారు. కేవలం 0.5 శాతం మాత్రమే ఉన్న కులాల వారు ప్రభుత్వంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారని అన్నారు.