మరోసారి టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి

17-07-2021 Sat 15:29
  • ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాలనుకున్న సుబ్బారెడ్డి
  • మరోసారి టీటీడీ ఛైర్మన్ గా నియమించిన జగన్
  • రెండున్నరేళ్లు ఛైర్మన్ గా కొనసాగనున్న సుబ్బారెడ్డి
YV Subba Reddy appointed as TTD Chairman

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియమితుయ్యారు. టీటీడీ ఛైర్మన్ గా ఇటీవలే ఆయన పదవీకాలం ముగిసింది. అయితే టీటీడీ ఛైర్మన్ గా ఉండటం వల్ల ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరంగా ఉండాల్సి వస్తోంది. దీంతో, ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్లీ కీలకంగా మారాలని అనుకుంటున్నానని ఇటీవల సుబ్బారెడ్డి ప్రకటించారు. ఇదే విషయాన్ని జగన్ కు కూడా చెప్పానని తెలిపారు. జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని చెప్పారు. దీంతో, ఆయనకు కీలక బాధ్యతలు దక్కబోతున్నాయని అందరూ భావించారు.
 
అయితే అనుకున్న విధంగా జరగలేదు. టీటీడీ ఛైర్మన్ గా రెండోసారి ఆయనకు జగన్ బాధ్యతలను అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నామినేటెడ్ పదవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవుల జాబితాలో సుబ్బారెడ్డి పేరు ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది.
 
2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ సీటును వైవీ సుబ్బారెడ్డి అతి కష్టం మీద వదులుకోవాల్సి వచ్చింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డికి లోక్ సభ సీటును ఆయన త్యాగం చేయాల్సి వచ్చింది. అనంతరం టీటీడీ ఛైర్మన్ గా సుబ్బారెడ్డికి జగన్ అవకాశం కల్పించారు. మరో రెండున్నరేళ్లు ఆయన టీటీడీ ఛైర్మన్ గా కొనసాగనున్నారు.