బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవిని ఇచ్చిన జగన్

17-07-2021 Sat 15:03
  • ఈరోజు నామినేటెడ్ పదవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
  • ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి
  • బైరెడ్డికి మంచి పోస్టు ఇస్తానని గతంలోనే  చెప్పిన జగన్
Jagan gives key post to Byreddy Siddharth Reddy

కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ కీలక పదవిని కట్టబెట్టారు. ఈ రోజు నామినేటెడ్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్థ్ ను జగన్ నియమించారు. 2019 ఎన్నికల్లో నందికొట్కూరు ఎమ్మెల్యే టికెట్ దక్కకపోయినప్పటికీ వైసీపీ గెలుపు కోసం బైరెడ్డి కృషి చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఆర్థర్ కు, బైరెడ్డికి అభిప్రాయ భేదాలు ముదిరాయి. ప్రతి ఎన్నికల సమయంలో తమ అనుచరుల టికెట్ల కోసం ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునేవారు. కర్నూలు జిల్లా ఇంచార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలోనే ఇరువురూ గొడవకు దిగిన సందర్భాలు ఉన్నాయి.
 
పాదయాత్ర సమయంలో జగన్ మాట్లాడుతూ తన మనసులో బైరెడ్డి ఉన్నాడని, కచ్చితంగా మంచి ప్రాధాన్యత ఉన్న పోస్టును ఇస్తానని చెప్పారు. చెప్పిన విధంగానే ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా... ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ గా నియమించారు. మరోవైపు బైరెడ్డి పేరును ప్రకటించగానే బైరెడ్డి ఇంటి వద్ద పార్టీ ఆఫీసు వద్ద సందడి నెలకొంది. ఆయన అనుచరులు స్వీట్లు పంచుకున్నారు. టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు.