రక్తం పీల్చే జలగకన్నా దారుణంగా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు: నారా లోకేశ్ మండిపాటు

17-07-2021 Sat 12:27
  • ఆకాశమే హద్దుగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు
  • ఇండియన్ పెట్రోల్ లీగ్ లో రికార్డుల మోత
  • బాదుడు రెడ్డి అనే పేరుని జ‌గ‌న్ సార్ధకం చేసుకున్నారు
lokesh slams jagan

పెట్రోల్, డీజిల్ ధ‌రల పెరుగుద‌ల‌పై టీడీపీ నేత నారా లోకేశ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. 'రక్తం పీల్చే జలగకన్నా దారుణంగా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు వైఎస్ జ‌గ‌న్. ఆకాశమే హద్దుగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు దూసుకెళ్తున్నాయి. ఇండియన్ పెట్రోల్ లీగ్ లో రికార్డుల మోత మోగిస్తూ పెట్రోల్ ధరను రూ.108, డీజిల్ ధరను రూ.100 చేసి బాదుడు రెడ్డి అనే పేరుని సార్ధకం చేసుకున్నారు' అని నారా లోకేశ్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

'31 శాతం వ్యాట్ లీటర్ కు రూ.4 అదనపు వ్యాట్ లీటర్ కు రూ.1 రోడ్డు అభివృద్ధి సుంకం అన్నీ వెరసి ప్రజలపై బాదుడు రెడ్డి భారం లీటర్ కు 30 రూపాయలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం పన్నులు తగ్గించుకుంటే తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ ఇవ్వొచ్చని నీతి కబుర్లు చెప్పిన బాదుడు రెడ్డి ఇప్పుడు పన్నులు ఎందుకు తగ్గించడం లేదు? ఇతర రాష్ట్రాల పెట్రోల్ బంకుల్లో ఏపీ కంటే తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ అంటూ బోర్డులు పెట్టారంటే మీ దోపిడీ ఏ రేంజ్ లో ఉందో అర్థ‌మవుతుంది' అని నారా లోకేశ్ విమ‌ర్శించారు.

ఇప్పటికైనా ప్రతిపక్షంలో అన్న మాటకు కట్టుబడి రాష్ట్ర పన్నుల భారాన్ని తగ్గించి తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ అందించాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.