USA: భారత నౌకాదళం మరింత శక్తిమంతం.. రెండు హెలికాప్టర్లను అందించిన అమెరికా

  • సర్కోస్కీ ఎంహెచ్ 60 ఆర్ హెలికాప్టర్ల అందజేత
  • 24 హెలికాప్టర్ల కొనుగోలుకు అగ్రరాజ్యంతో ఒప్పందం
  • డీల్ విలువ రూ.18 వేల కోట్లు
  • సిబ్బందికి అమెరికాలో శిక్షణ
US Handed Over 2 Multi Role Helicopters To India

భారత నౌకాదళం అమ్ములపొది మరింత శక్తిమంతమైంది. భారత్–అమెరికా మధ్య రక్షణ బంధమూ బలోపేతం కాబోతోంది. ఈ రోజు రెండు బహుళ ప్రయోజన ‘సర్కోస్కీ ఎంహెచ్ 60 ఆర్ (రోమియో)’ హెలికాప్టర్లను భారత నౌకాదళానికి అమెరికా నౌకాదళం అందించింది. అమెరికాలోని శాన్ డియాగో నేవల్ ఎయిర్ స్టేషన్ లో భారత నౌకాదళ అధికారులకు లాక్ హీడ్ మార్టిన్ సంస్థ తయారు చేసిన ఈ హెలికాప్టర్లను అందజేసింది.

ఈ కార్యక్రమానికి అమెరికాలో భారత రాయబారి తరణ్ జీత్ సింగ్ సంధుతో పాటు భారత నౌకాదళ అధికారి వైస్ అడ్మిరల్ రవ్నీత్ సింగ్, అమెరికా నేవీ కమాండర్ నేవల్ ఎయిర్ ఫోర్సెస్ వైస్ అడ్మిరల్ కెనెత్ వైట్ సెల్, లాక్ హీడ్ మార్టిన్ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. మొత్తంగా సుమారు రూ.18 వేల కోట్లతో (240 కోట్ల డాలర్లు) 24 హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు అమెరికాతో భారత్ ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగానే ఈ రోజు రెండు హెలికాప్టర్లు భారత్ కు అందాయి. ఆ పత్రాలను రెండు దేశాల నేవీ అధికారులు మార్చుకున్నారు.

అన్ని వాతావరణాల్లోనూ సమర్థంగా పనిచేసే ఈ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ బంధం మరింత దృఢమవుతుందని తరణ్ జీత్ సింగ్ సంధు అన్నారు. ఇప్పటికే గత రెండేళ్లలో 2000 కోట్ల డాలర్ల ఒప్పందాలు జరిగాయని గుర్తు చేశారు. కేవలం కొనుగోళ్లకే పరిమితం కాకుండా రక్షణ రంగ వ్యవస్థల అభివృద్ధి, వాటి ఉత్పత్తిలో కలిసి పనిచేసేందుకు రెండు దేశాలు కసరత్తులు చేస్తున్నాయన్నారు. రక్షణ రంగంలో భారత్ తీసుకొచ్చిన సంస్కరణలతో విదేశీ పెట్టుబడిదారులకు మరిన్ని కొత్త అవకాశాలు అందుతాయన్నారు.

కాగా, ప్రస్తుతం ఈ హెలికాప్టర్ల వినియోగం కోసం భారత సిబ్బందికి అమెరికాలో శిక్షణనిస్తున్నారు. సామర్థ్యం, పనితీరు విషయంలో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన హెలికాప్టర్లుగా ఈ ఎంహెచ్ఆర్ ప్రసిద్ధి. వీటితో భూమ్మీద ఉన్న శత్రు లక్ష్యాలను ఛేదించడంతో పాటు జలాంతర్గాములపైనా దాడులు చేసేందుకు వీలుంటుంది. కేవలం మిలటరీ ఆపరేషన్లకు మాత్రమే కాకుండా సహాయ చర్యలు, కమ్యూనికేషన్స్ వంటి వాటికీ ఈ హెలికాప్టర్లను వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. అమెరికా నుంచి తీసుకున్న తర్వాత మన ఆయుధాలు, ఇతర పరికరాలతోనూ వాటిని అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ హెలికాప్టర్లను కొనుగోలు చేస్తున్నట్టు గత ఏడాది ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం ప్రకటించింది.

More Telugu News