మూడో ముప్పు పొంచి ఉన్నా మాస్కులకు రాంరాం.. 74 శాతం తగ్గిన వినియోగం!

17-07-2021 Sat 09:35
  • థర్డ్ వేవ్ ఉద్ధృతిని కొట్టిపారేయలేం
  • వచ్చే 125 రోజులు ఎంతో కీలకం
  • దేశం ఇంకా హెర్డ్ ఇమ్యూనిటీ దశకు చేరుకోలేదు
74 precent people not wearing masks

కరోనా మహమ్మారి బారి నుంచి దేశం పూర్తిగా కోలుకోకున్నా, మూడో ముప్పు పొంచి ఉందన్న విషయం తెలిసినా జనం నిర్లక్ష్యం వీడడం లేదు. దేశంలో లాక్‌డౌన్ నిబంధనలు ఎత్తివేసిన తర్వాత మాస్కుల వినియోగం ఏకంగా 74 శాతం తగ్గిపోయినట్టు కేంద్రం పేర్కొంది. ఆంక్షలు సడలించి కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ప్రజలు మాస్కులు పెట్టుకోవడం మానేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. థర్డ్ వేవ్ ఉద్ధృతిని కొట్టిపారేయలేమని, వచ్చే 125 రోజులు ఎంతో కీలకమని పేర్కొన్నారు.

నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ నిన్న ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. మే-జులై మధ్య ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నట్టు గూగుల్ మొబిలిటీ డేటా సూచిస్తోందన్నారు. వైరస్ వ్యాప్తికి ఇది కారణం కాగలదని హెచ్చరించారు. దేశం ఇంకా హెర్డ్ ఇమ్యూనిటీ దశకు చేరుకోలేదని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరిన్ని ఉద్ధృతులను చూడాల్సి రావొచ్చని, కాబట్టి కరోనాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని వీకే పాల్ తెలిపారు.