రెండు దశాబ్దాల సహజీవనం తర్వాత 60 ఏళ్ల వయసులో పెళ్లితో ఒక్కటైన జంట!

17-07-2021 Sat 07:23
  • ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఘటన
  • కుమారుడి కోసం పెళ్లి చేసుకోవాలని ఒప్పించిన గ్రామ పెద్దలు
  • ఖర్చు భరించి పెళ్లి చేసిన గ్రామస్థులు
Elderly Couple Marry After 20 Years Of Live In

రెండు దశాబ్దాలపాటు సహజీవనం చేసిన ఓ జంట 60 ఏళ్ల వయసులో ఇప్పుడు పెళ్లితో ఒక్కటైంది. గ్రామస్థులు దగ్గరుండి మరీ వీరి వివాహాన్ని జరిపించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో జరిగిన ఈ పెళ్లి వైరల్ అయింది.

జిల్లాలోని రసూల్‌పూర్ రూరీ గ్రామానికి చెందిన నరైన్ రైదాస్ (60), రామ్‌రతి (55) ప్రేమించుకున్నారు. ఆ తర్వాత అదే గ్రామంలో 2001 నుంచి సహజీవనం చేస్తున్నారు. తొలుత వీరి సహజీవనాన్ని గ్రామస్థులు వ్యతిరేకించారు. అయితే, పెద్దలను ఒప్పించిన ఈ జంట అప్పటి నుంచి కలిసే ఉంటున్నారు. వీరికి 13 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. సహజీవనంలో దాదాపు 20 ఏళ్లు గడిచిపోయినా వివాహం మాత్రం చేసుకోలేదు.

ఈ క్రమంలో వారు ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నారు. అయినప్పటికీ పెళ్లి ఆలోచన చేయలేదు. ఇటీవల గ్రామ పెద్దలు ఈ జంటను కలిసి వివాహం చేసుకోవాలని కోరారు. కుమారుడు మున్ముందు అవమానాలు పడకుండా ఉండాలంటే వివాహం చేసుకోవడం ఒక్కటే మార్గమని నచ్చజెప్పారు. అంతేకాదు, వివాహానికి అయిన ఖర్చును కూడా తామే భరిస్తామని చెప్పి ఒప్పించడంతో రైదాస్, రామ్‌రతి జంట వివాహానికి అంగీకరించింది. దీంతో గ్రామ పెద్దలు, కుమారుడి సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.