సమంత చేతుల మీదుగా 'తిమ్మరుసు' టైటిల్ సాంగ్ రిలీజ్!

16-07-2021 Fri 18:51
  • సత్యదేవ్ హీరోగా 'తిమ్మరుసు'
  • కథానాయికగా ప్రియాంక జవాల్కర్
  • సంగీత దర్శకుడిగా శ్రీచరణ్ పాకాల 
  • ఈ నెల 30వ తేదీన విడుదల   
Thimmarusu Song launched by Samantha

సత్యదేవ్ మొదటి నుంచి కూడా విభిన్నమైన ... విలక్షణమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. నిదానమే ప్రధానమన్నట్టుగా తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'తిమ్మరుసు' రూపొందింది. ఈ సినిమాతో శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించాడు. ఈ పాటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ కరోనా కారణంగా విడుదలను వాయిదా వేసుకుంటూ వచ్చింది. ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు.
 
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి 'సమంత' చేతుల మీదుగా టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయించారు. ప్రధానమైన పాత్రలపై చిత్రీకరించిన టైటిల్ సాంగ్ ద్వారా సత్యదేవ్ పాత్ర తీరుతెన్నులను చెప్పే ప్రయత్నం చేశారు. రూపాయి లాభం రాకపోయినా, ఆయన సత్యాన్వేషణ సాగుతూనే ఉందనే అర్థంలో ఈ పాట నడుస్తోంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. కొంతకాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సత్యదేవ్ కి ఈ సినిమా ఆ ముచ్చట తీరుస్తుందేమో చూడాలి.