Ramana: ఈ టెక్నాలజీ యుగంలో కూడా పావురాళ్ల కబురు కోసం ఆకాశంలోకి చూస్తున్నట్టుంది: జస్టిస్ ఎన్వీ రమణ

Justice NV Ramana comments on present system of court orders transmission to prisons
  • బెయిల్ ఆర్డర్లు జైళ్లకు అందడంలో జాప్యం
  • ఖైదీల విడుదల ఆలస్యం
  • అసంతృప్తి వ్యక్తం చేసిన ఎన్వీ రమణ
  • ఫాస్టర్ విధానం తీసుకువస్తున్నట్టు వెల్లడి
కోర్టులు జారీ చేసే ఆదేశాల ప్రతులు జైళ్లకు అందడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిన నేటి కాలంలోనూ ఇంకా పాత రోజుల్లోనే ఉన్నామని అన్నారు. పావురాళ్లు తీసుకువచ్చే కబురు కోసం ఆకాశంలోకి చూస్తున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. కోర్టుల నుంచి జైళ్లకు ఏదైనా అధికారిక సమాచారం అందాలంటే ఎంతో సమయం పడుతోందని తెలిపారు.

ఇకపై జైళ్లకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో బెయిల్ ఆదేశాలు, ఇతర ఉత్తర్వులను పంపే విధానంపై సుప్రీంకోర్టు కసరత్తులు చేస్తోందని వెల్లడించారు.

 "ఇది టెక్ యుగం. ఫాస్టర్ (FASTER) పేరుతో కొత్త విధానం తెస్తున్నాం. ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్ మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్ అని దీనర్థం. కోర్టులు జారీ చేసే ఆదేశాలు, ఉత్తర్వులు ఈ విధానం ద్వారా ఎలాంటి ఆలస్యం లేకుండా జైళ్ల అధికారులకు వెంటనే అందుతాయి. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న ఇప్పటి రోజుల్లోనూ, బెయిల్ ఆర్డర్లు, ఇతర పత్రాల అందజేత ఎంతో ఆలస్యంగా సాగుతోంది" అని ఎన్వీ రమణ పేర్కొన్నారు.

మరో నెలలోనే ఫాస్టర్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని, దీనిపై నివేదికను రెండు వారాల్లో సమర్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తున్నట్టు తెలిపారు. బెయిల్ పత్రాలు అందని కారణంగా ఖైదీల విడుదలలో జాప్యం జరిగిన ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ విచారణ సందర్భంగానే సీజేఎ ఎన్వీ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు.
Ramana
CJI
FASTER
Bail Orders
Courts
Prisons
Supreme Court
Technology
Pigeons
India

More Telugu News