చివరి షెడ్యూల్ దిశగా 'రాధేశ్యామ్'

16-07-2021 Fri 17:38
  • పునర్జన్మలతో కూడిన ప్రేమకథ 
  • విదేశాల నేపథ్యంలో నడిచే కథ 
  • కీలకపాత్రలో భాగ్యశ్రీ
  • విడుదల తేదీపై చర్చలు   
Radhe Shyam last schedule shooting

ప్రభాస్ తాజా చిత్రంగా 'రాధే శ్యామ్' రూపొందుతోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని ఇంతకుముందు అన్నారు. ఆ తరువాత కొన్ని సన్నివేశాల పట్ల ప్రభాస్ అసంతృప్తిగా ఉన్నాడనీ, అందువలన మరో సింగిల్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారని చెప్పుకున్నారు. సరే .. ఏదేమైనా మొత్తానికి ఒక సింగిల్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారనే టాక్ మాత్రం బలంగానే వినిపిస్తోంది. ఈ నెల 23వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకూ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.

ఈ చిత్రీకరణతో షూటింగు పార్టు పూర్తవుతుందని అంటున్నారు. ఈ షెడ్యూల్లో ప్రభాస్ తదితరులు పాల్గొననున్నారని చెబుతున్నారు. పునర్జన్మలతో ముడిపడిన ప్రేమకథ ఇది .. దాదాపుగా విదేశాల్లోనే ఈ కథ నడుస్తుంది. ప్రభాస్ సరసన నాయికగా పూజ హెగ్డే అలరించనుంది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ 'భాగ్యశ్రీ' ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ముఖ్యమైన పాత్రను కృష్ణంరాజు పోషిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమా విడుదల తేదీపై చర్చలు జరుగుతున్నాయట.