నీటి దొంగలెవరో ఇప్పుడు ప్రజలకు తెలిసిపోయింది: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

16-07-2021 Fri 17:24
  • నదీ బోర్డులపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్
  • స్వాగతించిన ఏపీ
  • వ్యతిరేకించిన తెలంగాణ సర్కారు
  • అభ్యంతరాలు ఎందుకో చెప్పాలన్న విష్ణు
Vishnu Vardhan Reddy slams TRS Govt over Gazette Notification

కేంద్రం కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై స్పష్టత నిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వగా, తెలంగాణ ప్రభుత్వం దానిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో, ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు.

నీటి దొంగలెవరో తెలిసిపోయిందని ఆయన పేర్కొన్నారు. అక్రమ ప్రాజెక్టులు నిర్మించి నీటి చౌర్యం, అక్రమ విద్యుత్ ఉత్పత్తి చేయకుంటే ఈ నోటిఫికేషన్ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టు? అని విష్ణు సీఎం కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. అంతర్రాష్ట్ర జలవివాదాలు, ప్రాజెక్టుల పరిరక్షణను కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చే ఈ నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని నిలదీశారు.

"నీటి దొంగలు ఎవరనేది ప్రజలకు తెలుస్తుందని భయపడుతున్నారా? కానీ, ఇప్పుడు దొంగలెవరో, దొరలెవరో ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయింది. దొంగే దొంగా దొంగా అని అరుస్తున్న రీతిలో మీ టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అందరికీ అర్థమైంది. మీరు తప్పు చేయకపోతే కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించాలి" అని స్పష్టం చేశారు.