అమరావతి భూములపై సుప్రీంకోర్టులో విచారణ.... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ద్విసభ్య ధర్మాసనం

16-07-2021 Fri 17:07
  • ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటున్న ఏపీ సర్కారు
  • సర్కారుకు వ్యతిరేకంగా గతంలో హైకోర్టు తీర్పు
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
  • హైకోర్టు తీర్పు సబబేనన్న ద్విసభ్య ధర్మాసనం
Supreme Court hearing on Amaravathi insider trading case

ఏపీ రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ సర్కారు ఆరోపిస్తుండడం తెలిసిందే. రాజధాని ప్రకటన రాకముందే అమరావతిలో పెద్ద ఎత్తున భూ లావాదేవీలు జరిగాయంటూ వైసీపీ నేతలు గత ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అయితే ఏపీ హైకోర్టు అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని తీర్పు ఇవ్వడంతో, ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.  

ఈ అంశంలో నేడు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఏపీ సర్కారు పేర్కొన్న అంశాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోకుండా తీర్పు ఇచ్చిందని తెలిపారు.

అందుకు జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పందిస్తూ.... అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే హైకోర్టు తీర్పు ఇచ్చినట్టు తాము గుర్తించామని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుతో ఏకీభవిస్తున్నామని, ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు భావించలేమని పేర్కొంది. భూములు అమ్మినవాళ్లు తాము మోసపోయామని ఒక్కరైనా ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించింది.

దాంతో, ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది దవే స్పందిస్తూ... గతంలో హర్యానా భూముల విషయంలో ఇచ్చిన తీర్పును పరిశీలించాలని కోరారు. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.