హీరోయిన్ తాప్సి నిర్మిస్తున్న తొలిచిత్రం 'బ్లర్'

16-07-2021 Fri 16:31
  • బాలీవుడ్ లో బిజీగా వున్న తాప్సి
  • నిర్మాతగా మారుతున్నట్టు ప్రకటన
  • 'ఔట్ సైడర్స్ ఫిలిమ్స్' పేరిట బ్యానర్
  • స్పానిష్ సినిమా 'జులియాస్ ఐస్'కి రీమేక్
Tapsee Pannus maiden venture as producer is Blur

కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో కొన్ని చిత్రాలు చేసిన తర్వాత తాప్సి బాలీవుడ్ కి వెళ్లింది. ఆమె చేస్తున్న హిందీ సినిమాలు కూడా సక్సెస్ అవుతుండడంతో అక్కడ కూడ తాను కథానాయికగా బిజీగానే వుంది. ఆమె నటించిన మూడు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. మరోపక్క కొత్తగా ఐదు సినిమాలు షూటింగుకి సిద్ధమవుతున్నాయి.

ఈ క్రమంలో తాను నిర్మాతగా మారుతున్నట్టు ఇటీవలే ఈ చిన్నది ప్రకటించింది. 'ఔట్ సైడర్స్ ఫిలిమ్స్' పేరిట ఓ చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పినట్టు, దీనిపై అర్థవంతమైన వినోదాత్మక చిత్రాలను నిర్మించనున్నట్టు, కొత్త టాలెంటుకి అవకాశం కల్పించనున్నట్టు ఆమె తెలిపింది. ఇక తాజాగా నిర్మాతగా తన తొలిచిత్రాన్ని తాప్సి ప్రకటించింది. ఈ చిత్రం పేరు బ్లర్. ఇందుకు సంబంధించిన టైటిల్ తో కూడిన పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది.
 
పదేళ్ల క్రితం స్పానిష్ లో వచ్చిన 'జులియాస్ ఐస్' అనే హారర్ థ్రిల్లర్ కి రీమేక్ గా ఈ 'బ్లర్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి అజయ్ భల్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది విడుదలయ్యేలా చిత్ర నిర్మాణాన్ని జరుపుకునే ఈ చిత్రంలో తాప్సి కీలక పాత్ర పోషించనుంది.