T20 World Cup: టీ20 వరల్డ్ కప్ గ్రూపులు ప్రకటించిన ఐసీసీ... ఒకే గ్రూప్ లో భారత్, పాకిస్థాన్

ICC announces world groups as India and Pakistan placed in same group
  • అక్టోబరు 17 నుంచి టోర్నీ
  • యూఏఈ వేదికగా మ్యాచ్ లు
  • ర్యాంకింగ్స్ ఆధారంగా గ్రూపుల్లో జట్లకు స్థానం
  • చిన్న జట్లతో రౌండ్-1
  • రౌండ్-2లో అగ్రజట్లతో గ్రూప్ ల ఏర్పాటు
ఈ ఏడాది టీ20 టోర్నీని ఎలాగైనా నిర్వహించాలని భావిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), ఈ దిశగా సన్నాహాలు ప్రారంభించింది. తాజాగా, టోర్నీలో పాల్గొనే జట్లతో గ్రూపులను ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 20 నాటికి ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఆయా జట్ల స్థానాలను బట్టి వరల్డ్ కప్ గ్రూపుల్లో వాటికి చోటు కల్పించారు. టోర్నీ ప్రాథమిక దశ రెండు రౌండ్లలో సాగనుంది.

ర్యాంకుల్లో టాప్-8 జట్లు నేరుగా రెండో రౌండ్ (సూపర్-12 దశ)లో ఆడతాయి. ఈ ఎనిమిది జట్లను గ్రూప్-1, గ్రూప్-2లో చేర్చారు.

ఐసీసీ ర్యాంకింగ్స్ లో దిగువన ఉన్న జట్లను, అర్హత పోటీల ద్వారా టోర్నీలో ప్రవేశం పొందిన జట్లను గ్రూప్-ఏ, గ్రూప్-బిగా విభజించారు. ఇవి తొలి రౌండ్ మ్యాచ్ లు ఆడి, ఆపై రెండో రౌండ్ (సూపర్-12)కు అర్హత సాధిస్తాయి. గ్రూప్-ఏ, గ్రూప్-బిలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సూపర్-12 దశకు చేరతాయి. టాప్-8 జట్లతో కలిసి ఈ 4 చిన్న టీమ్ లు కూడా సెకండ్ రౌండ్ (సూపర్-12) ఆడతాయి.

కాగా, చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు గ్రూప్-2లో ఉన్నాయి.

తొలి రౌండ్ ...
గ్రూప్-ఏ: శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా
గ్రూప్-బి: బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా, ఒమన్

సెకండ్ రౌండ్ (సూపర్-12)...
గ్రూప్-1: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, గ్రూప్-ఏ విన్నర్, గ్రూప్-బి రన్నరప్.
గ్రూప్-2: ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, గ్రూప్-బి విన్నర్, గ్రూప్-ఏ రన్నరప్.

భారత్ లో జరగాల్సిన ఈ మెగా ఈవెంట్ కరోనా వ్యాప్తి కారణంగా యూఏఈ తరలిపోయిన సంగతి తెలిసిందే. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు దుబాయ్, అబుదాబి, షార్జా, ఒమన్ క్రికెట్ స్టేడియాల్లో మ్యాచ్ లు నిర్వహించనున్నారు. త్వరలోనే టోర్నమెంట్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకటించనున్నారు.
T20 World Cup
Groups
India
Pakistan
UAE
Cricket

More Telugu News