ఏపీ, తెలంగాణ మధ్య సయోధ్యకు గెజిట్ నోటిఫికేషన్ తోడ్పడుతుంది: జీవీఎల్

16-07-2021 Fri 15:22
 • కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పరిధిని వివరించిన కేంద్రం
 • గెజిట్ నోటిఫికేషన్ విడుదల
 • తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ సర్కారు
 • కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన జీవీఎల్ 
GVL welcomes Union Govt Gazette Notification on Krishna and Godavari river management boards

కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్వచిస్తూ నేడు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం తెలిసిందే. తాజా గెజిట్ నోటిఫికేషన్ల ప్రకారం ఏపీ, తెలంగాణల్లోని నీటి ప్రాజెక్టులు ఆయా బోర్డుల పరిధిలోకి వెళతాయి. ఈ నోటిఫికేషన్ ను తెలంగాణ సర్కారు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. న్యాయపోరాటం చేయాలని భావిస్తోంది.

అయితే, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కేంద్రం తీసుకువచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ను స్వాగతించారు. ఆయా రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను నదీ యాజమాన్య బోర్డులకు అప్పగించడం శుభపరిణామం అని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు సమసిపోయేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. సరైన నిర్ణయం తీసుకున్నారంటూ జీవీఎల్ ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

అటు, ఏపీ సర్కారు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ను స్వాగతిస్తున్నట్టు తెలిపింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి దీనిపై మాట్లాడుతూ... గెజిట్ తో అనేక సమస్యలకు పరిష్కారం లభించినట్టయిందని తెలిపారు. ఇకపై తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఉండబోవని ఆశాభావం వ్యక్తం చేశారు.

గెజిట్ నోటిఫికేషన్ ముఖ్యాంశాలు ఇవిగో...

అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని, ఎంతో చర్చించిన మీదటే బోర్డుల పరిధిని నిర్ణయించామని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సీడబ్ల్యూసీతో సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఎంతో ఆలోచించాకే గెజిట్ లో ప్రతి పదం, ప్రతి వాక్యం పొందుపరిచామని వివరించింది. ఏపీ విభజన చట్టం మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నామని కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటాల పంపిణీ అంశం చాలా సున్నితమైనదని పేర్కొంది.

 • బోర్డుల నిర్వహణ వ్యయాన్ని రెండు రాష్ట్రాలు సమానంగా భరించాలి.
 • నోటిఫికేషన్ వచ్చిన 60 రోజుల్లోగా రూ.200 కోట్ల చొప్పున డిపాజిట్ చేయాలి.
 • బోర్డుల నిర్వహణకు నిధులు, వనరుల కొరత రాకూడదు.
 • ఏది ఆమోదం పొందిన ప్రాజెక్టో, ఏది ఆమోదం పొందలేదో గెజిట్ నోట్ లో వివరణ.
 • బి-పార్ట్ షెడ్యూల్ లో ఉన్నంత మాత్రాన ఆమోదం పొందినట్టు కాదు.
 • నోటిఫికేషన్ లోని షెడ్యూల్-2 పూర్తిగా బోర్డుల పరిధిలోనే ఉంటుంది.
 • షెడ్యూల్-3లో ప్రస్తుతం ఉన్నట్టే రాష్ట్రాల పర్యవేక్షణ ఉంటుంది.
 • కృష్ణా, గోదావరి బోర్డుల సూచనల మేరకే నిర్ణయాలు తీసుకోవాలి.
 • ఉభయ రాష్ట్రాల అవసరాలు, ప్రతిపాదనల మేరకు నీటి విడుదల.