రిషబ్ పంత్ కు కరోనా సోకడంపై రకరకాల ప్రచారం!

16-07-2021 Fri 14:48
  • ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న టీమిండియా
  • గత నెలలో ఫుట్ బాల్ మ్యాచ్ లకు వెళ్లిన పంత్
  • జులై మొదట్లో దంతవైద్యుడ్ని సంప్రదించిన వైనం
  • ఆ తర్వాతే పంత్ కు కరోనా పాజిటివ్
Rishabh Pant tested corona delta variant positive

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కరోనా బారినపడడం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న పంత్ కొన్నిరోజుల కిందట కరోనా (డెల్టా వేరియంట్) పాజిటివ్ గా తేలాడు. బయోసెక్యూర్ బబుల్ కొనసాగుతున్న పంత్ కు కరోనా ఎలా సోకిందన్న దానిపై రకరకాల కారణాలు ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల ఇంగ్లండ్ లో యూరోకప్ సాకర్ టోర్నీ జరిగింది. ఈ ఫుట్ బాల్ మ్యాచ్ లకు పంత్ కనీసం మాస్కు కూడా లేకుండా వెళ్లినట్టు తెలుస్తోంది.  

గత నెల 29న వెంబ్లీ స్టేడియంలో సాకర్ మ్యాచ్ వీక్షించిన పంత్ మాస్కు లేకుండా కొందరు అభిమానులతో ఫొటోలకు పోజులిచ్చాడు. ఇక, ఈ నెల మొదటి వారంలోఓ దంత వైద్యుడ్ని కూడా సంప్రదించాడు. దంత వైద్యుడి వద్దకు వెళ్లొచ్చిన తర్వాతే పంత్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో, డెంటల్ ఆసుపత్రిలో పంత్ కరోనా బారినపడి ఉంటాడని భావిస్తున్నారు.

కాగా, పంత్ తో పాటు టీమిండియా సహాయక సిబ్బందిలో ఒకరైన దయానంద గారానీ కూడా కరోనా బారినపడ్డట్టు సమాచారం. లక్షణాలు లేకపోయినా ప్రస్తుతం వీరిరువురినీ క్వారంటైన్ లో ఉంచినట్టు తెలుస్తోంది.