Venkat Balmoor: ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడిని రోడ్డుపై వెంబడించి మరీ అరెస్ట్ చేసిన పోలీసులు... రేవంత్ ఆగ్రహం

Police arrests NSUI President Venkat Balmoor
  • దేశంలో పెట్రో ధరల పెంపు
  • ఛలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చిన తెలంగాణ కాంగ్రెస్
  • కాంగ్రెస్ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు
  • పోలీసులు తీరుపై వెంకట్ బాల్మూర్ అసంతృప్తి
  • అనుమతి ఉన్నా ఎలా అరెస్ట్ చేస్తారన్న రేవంత్ రెడ్డి
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఛలో రాజ్ భవన్ ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఛలో రాజ్ భవన్ ను భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా, కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ యూఐ తెలంగాణ అధ్యక్షుడు, ఏఐసీసీ సభ్యుడు వెంకట్ బాల్మూర్ ను పోలీసులు రోడ్డుపై వెంబడించి మరీ వచ్చి పట్టుకున్నారు.

పోలీసులు తన చొక్కా పట్టి లాగుతున్నప్పటికీ వెంకట్ రాజ్ భవన్ దిశగా పరుగులు తీశారు. అయితే పెద్ద సంఖ్యలో వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తాము అనుమతి తీసుకున్నప్పటికీ పోలీసులు అరెస్ట్ చేశారంటూ వెంకట్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి గులాంగిరీ చేస్తున్నారంటూ ఆరోపించారు.

కాగా, ఎన్ఎస్ యూఏ చీఫ్ వెంకట్ బాల్మూర్ అరెస్ట్ వీడియోపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. పోలీసుల తీరు అరాచకంగా ఉందని విమర్శించారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసేందుకు తమకు అనుమతి ఉన్నప్పటికీ, వెంకట్ ను ఎలా అరెస్ట్ చేస్తారంటూ రేవంత్ ప్రశ్నించారు.
Venkat Balmoor
NSUI
Arrest
Chalo Rajbhavan
Hyderabad
Revanth Reddy
Congress
Telangana

More Telugu News