దాదాపు ట్రైల‌ర్ విడుద‌ల చేసినంతగా ఈ మేకింగ్ వీడియోకు స్పంద‌న వ‌చ్చింది: రాజ‌మౌళి

16-07-2021 Fri 11:18
  • ఆర్ఆర్ఆర్ నుంచి నిన్న మేకింగ్ వీడియో విడుద‌ల‌
  • అభిమానులు దీన్ని ఆద‌రిస్తోన్న తీరుకు కృత‌జ్ఞ‌త‌లు
  • షూటింగ్, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్నా
  • రెండు నెల‌ల పాటు మేకింగ్ వీడియో కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేసిన వారికి థ్యాంక్స్
 Thank you all for the wonderful reception for the Making Video

టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న అస‌లు సిస‌లైన మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఆర్ఆర్ఆర్ నుంచి నిన్న మేకింగ్ వీడియో విడుద‌లైన విష‌యం తెలిసిందే. దీనికి మంచి స్పంద‌న వ‌స్తుండ‌డంతో దీనిపై రాజ‌మౌళి స్పందించారు. అభిమానులు దీన్ని ఆద‌రిస్తోన్న తీరుకు ఆయన కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు.

దాదాపు ట్రైల‌ర్ విడుద‌ల చేసినంతగా ఈ మేకింగ్ వీడియో ప‌ట్ల అందరూ ఆద‌ర‌ణ క‌న‌బ‌ర్చార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. దీని ప‌ట్ల చాలా మంది త‌న‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నార‌ని చెప్పారు. అయితే, తాను షూటింగ్, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్నాన‌ని, రెండు నెల‌ల పాటు క‌ష్ట‌ప‌డి ప‌నిచేసిన సినీ బృందంలోని ప‌లువురు ఈ ప్ర‌శంస‌లు అందుకోవ‌డానికి అర్హుల‌ని ఆయ‌న అన్నారు. రెండు నెల‌ల పాటు దీనిపై వారు బాగా క‌ష్ట‌ప‌డి ప‌నిచేశార‌ని చెప్పారు. మేకింగ్ వీడియోను రూపొందించిన వారంద‌రికీ రాజ‌మౌళి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

కాగా, రోర్‌ ఆఫ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ పేరుతో మేకింగ్‌ వీడియో విడుద‌ల చేసి ఈ సినిమాపై రాజ‌మౌళి అంచ‌నాల‌ను మ‌రింత పెంచేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అలియా భట్‌, ఒలీవియా మోరిస్‌, అజయ్‌ దేవగణ్‌, సముద్రఖని వంటి వారు కీలక పాత్రల్లో న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో కొమరం భీమ్‌గా నటిస్తోన్న ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా నటిస్తోన్న రామ్ చరణ్ లకు సంబంధించిన టీజ‌ర్‌ల‌ను ఇప్ప‌టికే సినిమా బృందం విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం ఈ సినిమా ట్రైల‌ర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.