కేసీఆర్ బతికుండగానే తను సీఎం కావాలని ఈటల ప్రయత్నం చేశారు: హరీశ్ రావు ఫైర్

16-07-2021 Fri 10:55
  • ఈటలకు టీఆర్ఎస్ ఏం తక్కువ చేసింది?
  • కేసీఆర్ పెట్టిన రైతుబంధు పథకం దండగ అని అన్నారు
  • ఏ శక్తి కూడా టీఆర్ఎస్ ను ఏమీ చేయలేదు
Etela tried to become CM says Harish Rao

ఈటల రాజేందర్ టీఆర్ఎస్ లో ఉన్నంత కాలం... హరీశ్ రావుకు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు గుర్తింపు ఉండేది. అయితే ఈటల బీజేపీలో చేరిన తర్వాత ఆయనపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈటలపై ఆయన మరోసారి మండిపడ్డారు.

ఈటలకు అన్నం పెట్టింది, అ, ఆలు నేర్పింది కేసీఆర్ అని... కేసీఆర్ బతికుండగానే ముఖ్యమంత్రి కావాలని ఈటల ప్రయత్నం చేశారని హరీశ్ ఆరోపించారు. ఈటలకు టీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు. కేసీఆర్ బతికుండగానే ఆయన పెట్టిన రైతుబంధు పథకం దండగని అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈటల సీఎం కావాలని గతంలో బండి సంజయ్, రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి మాట్లాడినప్పుడు... ఆ వ్యాఖ్యలను ఈటల ఎందుకు ఖండించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఏ శక్తి కూడా టీఆర్ఎస్ ను ఏమీ చేయలేదని చెప్పారు.